రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు నరేంద్రమోడీ సర్కార్ పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తోందని గతంలో ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మంత్రులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. కానీ ది వైర్ ఫౌండర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ తో పాటు, ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ( OCCRP) కి చెందిన ఆనంద్ మంగ్నాలేకు చెందిన ఐఫోన్లలో ఈ స్పైవేర్ ఉన్నట్టు గుర్తించారు. దీనిపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఓ నివేదికను రిలీజ్ చేసింది. గత అక్టోబర్ లో వీళ్ళిద్దరి మొబైల్స్ వీటిని అమర్చారు. అందుకోసం ఓ ప్రభుత్వ సంస్థ కీలకంగా వ్యవహరించింది. పెగాసస్ స్పైవేర్ అనేది ఇజ్రాయెల్ కు చెందినది. ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి దీన్ని మోడీ ప్రభుత్వం వినియోగిస్తోందని గతంలో ప్రతిపక్షాలు ఆరోపించారు. వరదరాజన్ పై పెగాసస్ వాడటం ఇది రెండోసారి అంటున్నారు. మోడీకి సన్నిహితుడైన అదానీ వ్యాపార కార్యకలాపాలపై పరిశోధన చేస్తున్నందునే ఆనంద్ మంగ్నాలేను టార్గెట్ చేశారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
యాపిల్ ఫోన్ల నుంచి హెచ్చరికలు నిజమే.. 2023 అక్టోబర్ లో యాపిల్ సంస్థ నుంచి ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు మీ ఫోన్లను హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అలెర్ట్ మెస్సేజ్ లు వెళ్ళాయి. దాంతో ప్రతిపక్ష పార్టీల లీడర్లు కేంద్ర ప్రభుత్వం తమ మొబైల్స్ పై నిఘా పెడుతోందని పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత యాపిల్ దీనిపై వివరణ ఇచ్చింది. 150 దేశాల్లోని తమ ఐఫోన్లకు ఈ మెస్సేజ్ లు వెళ్లాయని ప్రకటించింది. ఇది అలెర్ట్ నెస్ లో భాగంగానే యాపిల్ కంపెనీ పంపిందని అందరూ భావించారు. కానీ అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ మాత్రం.. మోడీ ప్రభుత్వం యాపిల్ పై ఒత్తిడి తెచ్చి ఈ ప్రకటన చేయించిందని ఆరోపించింది.