అంతర్జాతీయ కెరీర్‌లో ఎంట్రీ ఇచ్చిన రెండేండ్లలోనే పొట్టి క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. టీ20లలో అతడు బరిలో ఉంటే లక్ష్యం ఎంత పెద్దదైనా చిన్నబోవాల్సిందే. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించే సూర్య.. క్రీజులో నటరాజు వలే శివతాండవం చేస్తాడు. ‘అసలు క్రికెట్‌లో ఇలాంటి షాట్లు ఆడటం సాధ్యమా..?’ అన్న రేంజ్‌లో అతడి విధ్వంసం సాగుతోంది. కానీ వన్డేలలో మాత్రం ఈ సూర్యుడు ఇంతవరకూ ప్రకాశించిన సందర్భాలు అరుదు. వన్డేలు ఆడుతూ మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు వేళ్లమీద లెక్కబెట్టగలిగే అన్ని కూడా ఉండవు. సున్నాలు చుట్టడం లేదంటే సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించడం.. వన్డేలలో సూర్య అత్యధిక స్కోరు 64.
మరి సూర్య వన్డే వరల్డ్ కప్‌లో మెరుస్తాడా..? అనేది సూర్యకు సపోర్ట్ చేస్తున్న సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది. పొట్టి ఫార్మాట్‌లో సూర్య ఆడింది 53 మ్యాచ్‌లే అయినా చేసింది 1,841 పరుగులు. ఈ రెండేండ్లలో భారత క్రికెట్‌లో మరే ఆటగాడికి లేని బ్యాటింగ్ యావరేజ్ సూర్య సొంతం. టీ20లలో సూర్య ఖాతాలో మూడు సెంచరీలతో పాటు ఏకంగా 15 అర్థ సెంచరీలు ఉన్నాయి. గతేడాది టీ20లలో వరల్డ్ నెంబర్ వన్‌గా ఎంపికైన సూర్య.. ఇప్పటికీ ఆ ర్యాంకును కాపాడుకుంటున్నాడు. టీ20లలో అదరగొట్టే సూర్య వన్డేలలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకూ అతడు 27 వన్డేలు ఆడి 25 ఇన్నింగ్స్‌లలో 537 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సూర్య.. మూడు డకౌట్లు అయ్యాడు. వెస్టిండీస్ సిరీస్‌లో మూడు వన్డేలు ఆడి వరుసగా, 19, 24, 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సూర్యకు ఆడే అవకాశం దక్కగా 34 బంతులాడిన సూర్య చేసినవి 26 పరుగులు మాత్రమే. ఇప్పటికే సంజూ శాంసన్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు ఛాన్స్ ఇచ్చినందుకు గాను క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ, సెలక్టర్లపై కారాలు మిరియాలు నూరుతున్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో సూర్య విఫలమయ్యాక ఆ ఘాటు సెలక్టర్లకు కాస్త ఎక్కువగానే తాకుతోంది.