Surya Kumar Yadav: గుడ్ మార్నింగ్ సూరీడు

వన్డేల్లో వేస్ట్ అంటూ తనపై వస్తున్న విమర్శలకు సూర్య ఈ ఇన్నింగ్స్ తో కాస్త సమాధానమిచ్చాడు. వరుసగా వికెట్లు పడ్డ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అతడు కేఎల్ రాహుల్ తో కలిసి కీలక భాగస్వమ్యాన్ని నెలకొల్పాడు.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 08:57 AM IST

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 277 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లతో పాటు, కెప్టెన్ రాహుల్, మిడిల్ ఆర్డర్ లో సూర్య చెలరేగడంతో భారత సూపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఇండోర్ వేదికగా ఆదివారం జరగనుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ ను దురుదృష్టం వెంటాడింది. గిల్ తో సమన్వయ లోపం కారణంగా శ్రేయస్ అయ్యర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

అనంతరం జంపా బౌలింగ్ లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే ఇషాన్ కిషన్ 18 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కి దిగాడు సూర్య కుమార్ యాదవ్. వన్డేల్లో వేస్ట్ అంటూ తనపై వస్తున్న విమర్శలకు సూర్య ఈ ఇన్నింగ్స్ తో కాస్త సమాధానమిచ్చాడు. వరుసగా వికెట్లు పడ్డ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అతడు కేఎల్ రాహుల్ తో కలిసి కీలక భాగస్వమ్యాన్ని నెలకొల్పాడు. అనవసరపు షాట్ల జోలికి పోకుండా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరు మొదట కుదురుకోవడానికి సమయం తీసుకుని ఆ తర్వాత స్వేచ్ఛగా షాట్స్ ఆడారు.

మంచి బంతులను గౌరవిస్తూనే.. గతి తప్పిన బంతులను బౌండరీలకు బాదారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కొన్ని సార్లు మిస్టర్ 360 షాట్స్ ఆడాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వేగంగా మ్యాచ్ ను ఫినిష్ చేయాలనే ఉద్దేశంలో వికెట్ పారేసుకున్నాడు. అయితే కేఎల్ రాహుల్.. ఫోర్, సిక్సర్ తో మ్యాచ్ ను ఎండ్ చేశాడు. సూర్య ఇంతే సంయమనంతో బ్యాటింగ్ చేయగలిగితే, వరల్డ్ కప్ లో భారత మిడిల్ ఆర్డర్ అద్భుతంగా నెట్టుకొస్తోంది అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.