గవర్నర్ కోటాలో శాసనమండలికి ఇద్దరి పేర్లను ఆమోదిస్తూ తెలంగాణ కేబినెట్ ఇటీవలే రాజ్‌భవన్‌కు దస్త్రాన్ని పంపించింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో సామాజిక, రాజకీయ, ఓట్ల సమీకరణలను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కె. సత్యనారాయణతో పాటు.. బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌ను మండలికి పంపాలనుకున్నారు. వీళ్లిద్దర్నీ గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేయడంతో రాజ్‌భవన్ ఆమోదం తప్పనిసరి. అయితే వీళ్లిద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై..ప్రభుత్వంతో ఎలాంటి వివాదం లేకుండా ఆమోదిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గతంలో జరిగిన పరిణామాలను చూస్తుంటే.. గవర్నర్ ఇంత ఈజీగా వాళ్లిద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ముందు రచ్చ.. ఆ తర్వాతే నిర్ణయం
ప్రభుత్వం బిల్లులు పంపిస్తుంది.. రాజ్‌భవన్ వాటిని పరిశీలిస్తుంది.. గవర్నర్ ఆమోదం కూడా లభిస్తుంది.. ఏమైనా సందేహాలుంటే.. వాటిని నివృత్తి చేసుకున్న తర్వాత బిల్లులు క్లియర్ అయిపోతుంటాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా జరిగే రాజ్యాంగబద్దమైన ప్రోటోకాల్ ఇదే. కానీ తెలంగాణలో మాత్రం బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి , రాజ్‌భవన్‌కు మధ్య నిత్యం యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎలాంటి సందేహాలు లేకుండా.. ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు లేకుండా.. మీడియా దృష్టికి రాకుండా.. రాజముద్రపడే బిల్లులు
చాలా తక్కువనే చెప్పాలి. గవర్నర్ తమిళిసైకి , కేసీఆర్ సర్కార్‌కు మధ్య నడుస్తున్న పంచాయితీ ఇప్పటిది కాదు. తాజాగా ఆర్టీసీ బిల్లు విషయంలోనూ కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి చూశాం. అనేక ప్రశ్నలు, సందేహాలు, కార్మికుల ఆందోళన తర్వాత టీఎస్ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ తమిళిసై. ఈ పంచాయితీ ముగిసిపోయింది అనుకునేలోపే.. మరో వివాదం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రూపంలో తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కౌశిక్ రెడ్డి సీన్ రిపీట్ అవుతుందా ?
పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో పెద్దల సభకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తమిళిసై అడ్డుకున్నారు. గవర్నర్ కోటా ద్వారా మండలిలో అడుగుపెట్టే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని భావించిన తమిళిసై.. ఆయన్ను సిఫార్సు చేసే ఫైల్ పై సంతకం పెట్టలేదు. తమిళిసై నిర్ణయం రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అటు గవర్నర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను రాజ్యాంగ పరిధిలోనే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేసిన తమిళిసై.. కౌశిక్ రెడ్డికి బ్రేక్ వేశారు. దీంతో గవర్నర్ కోటాలో మధుసూదనాచారిని పెద్దల సభకు పంపిన కేసీఆర్.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటా కేటాయించారు. ఇప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ విషయంలో గవర్నర్ ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. వీళ్లిద్దరి
రాజకీయ నేపథ్యాలను దృష్టి పెట్టుకుని.. నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడతారా లేక.. పచ్చజెండా ఊపుతారా అన్న విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
గవర్నర్ తమిళిసై మొదటి నుంచి కేసీఆర్ సర్కార్ తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు. ఒక వ్యక్తిగా కాకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌గానైనా తనకు విలువ ఇవ్వడం లేదని విమర్శిస్తూనే ఉన్నారు. గవర్నర్‌కు ఇచ్చే ప్రోటోకాల్‌ను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మిగతా గవర్నర్లకు భిన్నంగా ప్రభుత్వంపై తన అసంతృప్తిని మీడియా సాక్షిగానే వెల్లగక్కతున్నారు తమిళిసై. ప్రభుత్వానికి రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో తమిళిసై తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.