షార్ట్ బ్రేక్ లో టీ20 సిరీస్ సఫారీ గడ్డపై టీమిండియా

న్యూజిలాండ్ తో భారత్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఊహించని విధంగా ఆడిన మూడు టెస్టుల్లోనూ టీమిండియా ఓడిపోయి వైట్ వాష్ పరాభవాన్ని చవిచూసింది. ఈ సిరీస్ ముగిసిన ఐదు రోజుల్లోనే భారత్ మరో సిరీస్ కు రెడీ అయిపోయింది.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 07:00 PM IST

న్యూజిలాండ్ తో భారత్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఊహించని విధంగా ఆడిన మూడు టెస్టుల్లోనూ టీమిండియా ఓడిపోయి వైట్ వాష్ పరాభవాన్ని చవిచూసింది. ఈ సిరీస్ ముగిసిన ఐదు రోజుల్లోనే భారత్ మరో సిరీస్ కు రెడీ అయిపోయింది. అయితే టెస్ట్ జట్టులో ఉన్న ఆటగాళ్ళు కాదు… టీ ట్వంటీ ప్లేయర్స్ తో సెపరేట్ గా మరో టీమ్ సౌతాఫ్రికా వెళ్ళింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ ఆటగాళ్ళతో కూడిన యంగ్ ఇండియా సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. తిలక్ వర్మ, రింకూసింగ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ వంటి టీ ట్వంటీ ప్లేయర్స్ సౌతాఫ్రికా టూర్ కు ఎంపికయ్యారు. ఈ టూర్ లో భారత యువ జట్టు నాలుగు మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 8 నుంచి 15 వరకు ఈ నాలుగు టీ20ల సిరీస్ జరగనుండగా..అన్ని మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభంకానున్నాయి.

తొలి టీ ట్వంటీ డర్బన్ వేదికగా నవంబరు 8న జరగనుండగా… తర్వాతి మ్యాచ్ కు
గెకెబర్హా , మూడో టీ ట్వంటీకి సెంచూరియన్ , చివరి మ్యాచ్ కు జొహనెస్‌బర్గ్ ఆతిథ్యమివ్వనున్నాయి. శ్రీలంక పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్ గా పూర్తిస్థాయిలో బాధ్యతలను అందుకున్న సూర్యకుమార్‌కు సారథిగా అజేయ రికార్డు ఉంది. శ్రీలంక సిరీస్‌ను, ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను సూర్య సేన క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమయ్యే క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు గంభీర్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించట్లేదు. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పాటు వెళ్ళాడు.

లక్ష్మణ్ తో పాటు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్, శుభదీప్ ఘోష్ కోచింగ్ స్టాఫ్ గా ఉంటారు. మరోవైపు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్ క్రికెటర్లు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. వారం రోజులు ముందుగానే గంభీర్, మిగిలిన టెస్ట్ జట్టు ప్లేయర్స్ తో ఆసీస్ కు వెళ్ళనున్నాడు. స్వదేశంలో కివీస్ చేతిలో చావుదెబ్బ తిన్న భారత్ కు ఆసీస్ టూర్ కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఆసీస్ పై 4 టెస్టులు టీమిండియా గెలవాల్సిందే. ఇక ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలను ఆకట్టుకునేందుకు పలువురు యువక్రికెటర్లకు సఫారీలతో టీ ట్వంటీ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. అయితే.. దక్షిణాఫ్రికా జట్టుని దాని సొంతగడ్డపై ఓడించడం అంత సులువు కాదు. అయితే.. కొత్త ప్లేయర్లు ఎక్కువగా దక్షిణాఫ్రికా టీమ్‌లోకి రావడం భారత్ జట్టుకి కలిసొచ్చే అంశం.