TOP STORY:టెస్టు క్రికెట్ ను చంపేస్తున్న టీ20లు భవిష్యత్ లో వన్డే ఫార్మాట్ కు ప్రమాదమేనా ?

ఇప్పుడంతా ధనాధన్‌ యుగం...మైదానంలోకి దిగామా...బాల్‌ను బాదామా...ఇదే యంగ్ క్రికెటర్ల ఫార్ములా. బౌలర్ బంతిని ఎలా వేసినా సరే...బంతి బౌండరీ దాటాల్సిందే. లేదంటే స్టాండ్స్‌లో పడాల్సిందే. ఆడేది పది బాల్సయినా ఒకే..20 రన్స్‌ కొట్టాల్సిందే.

  • Written By:
  • Publish Date - October 21, 2024 / 06:06 PM IST

ఇప్పుడంతా ధనాధన్‌ యుగం…మైదానంలోకి దిగామా…బాల్‌ను బాదామా…ఇదే యంగ్ క్రికెటర్ల ఫార్ములా. బౌలర్ బంతిని ఎలా వేసినా సరే…బంతి బౌండరీ దాటాల్సిందే. లేదంటే స్టాండ్స్‌లో పడాల్సిందే. ఆడేది పది బాల్సయినా ఒకే..20 రన్స్‌ కొట్టాల్సిందే. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా…బౌలర్‌ను ఊచ కోత కోశామా లేదా అన్నదే చూస్తున్నారు. అంతే తప్పా…నో డిఫెన్స్‌…ఓన్లీ అటాకింగ్‌. టీ20లతో టెస్టు క్రికెట్‌ అంతమైపోతుందా ? రానురాను ఐదు రోజుల ఆడే ప్లేయర్లు కూడా ఉండరా ?

ట్వంటీ 20 ఫార్మాట్‌తో…క్రికెట్‌ ప్రపంచమే మారిపోయింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌…అంటే రోజుకు 90 ఓవర్లు. అదే వన్డే అంటే రెండు జట్లకు కలిపి వంద ఓవర్లు…కాలం మారింది. టెక్నాలజీ మారుతోంది…అందుకు తగ్గట్టుగానే క్రికెట్‌లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడంతా ధనా ధన్‌ ఇన్నింగ్స్‌ కాలం. ఐదు రోజుల పాటు టెస్టులు ఆడాల్సిన పని లేదు…50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. పొట్టి ఫార్మాట్…టెస్టులు, వన్డే మ్యాచ్‌లను మింగేసింది. స్పెషలిష్టు టెస్టు క్రికెటర్లు, వన్డే క్రికెటర్లను లేకుండా చేసింది. టీ20 ఫార్మాట్‌ రాకముందు..టెస్టులైనా, వన్డేలైనా ఒకే జట్టు ఉండేది. మహా అయితే ఒకరిద్దరు ప్లేయర్లను మార్చే వారు. టీ20ల ప్రవేశంతో మ్యాచ్‌ల స్వరూపం మారిపోయింది. ప్లేయర్లు మారిపోతున్నారు. టెస్టులకు ఒక జట్టు…వన్డేలకు ఇంకో జట్టు…టీ20లకు మరో జట్టును ఎంపిక చేస్తున్నారు. ఒక ఫార్మాట్‌లో ఉన్న ప్లేయర్‌ మరో ఫార్మాట్‌లో ఉండటం లేదు. ఆటలో ఉండే మజా కూడా వేరుగా ఉంటోంది.

ట్వంటీ 20ల్లో ఏ ప్లేయర్‌ కూడా పది ఓవర్లు బ్యాటింగ్‌ చేయడం లేదు. క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌…తొలిబాల్‌ నుంచి ఎదురుదాడి దిగుతున్నాడు. బాల్‌ను బౌండరీ లైన్‌ దాటించడం లేదంటే…సిక్సర్‌ కొట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాని…ఎక్కువ రాబట్టానికి ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. కానీ ఎక్కువ సేపు క్రీజులో ఉండటానికి ఆసక్తి చూపడం లేదు. ఇంకా చెప్పాలంటే…ప్లేయర్లలో ఓపిక తగ్గిపోతోంది. జెట్‌ స్పీడ్‌తో హీరోలైపోతున్నారు…అంతే స్పీడ్‌తో అడ్రస్‌ లేకుండా పోతున్నారు. కారణం…ధనాధన్‌ ఇన్నింగ్స్‌పై చూపుతున్న ఇంట్రెస్‌ టెస్టులు, వన్డేలపై చూపడం లేదు. ప్రస్తుత జనరేషన్‌లో వస్తున్న క్రికెటర్లంతా టీ20లకే అలవాటు పడుతున్నారు. బాల్‌ను బాదడానికి మొగ్గు చూపుతున్నారు. అంతేకాని…టెక్నిక్‌ గురించి పట్టించుకోవడం మానేశారు. లెగ్ స్పిన్‌ ఎలా ఆడాలి…ఆఫ్‌ స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలి…బౌన్సర్‌ను ఎలా డిఫెండ్‌ చేయాలి…గూగ్లీ వేస్తే ఎలా అడ్డుకోవాలి అన్న దాని గురించి ఆలోచించడం మానేశారు. టీ20 మాయలో పడి…టెస్టు, వన్డే క్రికెట్‌ను నాశనం చేస్తున్నారు.

టీ20ల ఫార్మాట్‌ రాకతో…ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు మారిపోయాయి. టెస్టులు, వన్డేలను గాలికి వదిలేశాయి. ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్పా…క్రికెటర్లలో టాలెంట్‌ను పట్టించుకోవడం మానేశాయి. గతంలో ఏ ప్లేయరైనా ఒకసారి జట్టులోకి వస్తే…కనీసం 12 నుంచి 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేవారు. వేలకు వేలు పరుగులు చేశారు. వన్డేల్లో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే…టెస్టుల్లో అయితే రోజుల తరబడి బ్యాటింగ్ చేసేవారు. బౌలర్లు రోజంతా బౌలింగ్‌ వేసేశారు. బ్యాటర్లు సుదీర్ఘంగా ఇన్నింగ్స్‌లు ఆడేవారు. బిగ్‌బాష్‌ లీగ్, ఐపీఎల్‌ లాంటి పొట్టి ఫార్మాట్లు ప్రపంచ టెస్టు క్రికెట్‌ను చంపేస్తున్నాయి…ఇంకా చెప్పాలంటే మింగేస్తున్నాయి. ధనా ధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా…టెస్టులు, వన్డే మ్యాచ్‌లు ఆడేవారు కరువైపోతున్నారు. అందరూ టీ20లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రికెట్‌ అంటే 20-20. ట్వంటీ 20 అంటే క్రికెట్‌ అనుకుంటున్నారు. క్రికెట్ పుట్టిన కొత్తలో టెస్టులకు విపరీతమైన క్రేజు ఉండేది. కొందరు ఆటగాళ్లు రోజంతా క్రీజులో ఉండేవాళ్లు. వన్డే ప్రపంచకప్ మొదలయ్యాక…దీనికి క్రేజ్ పెరిగింది. ఓపెనర్లు లేదా ఫస్ట్ డౌన్ లో వచ్చిన ప్లేయర్లు…50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసేవాళ్లు. అందుకే సెంచరీల మీద సెంచరీలు కొట్టారు. టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియన్ లారా, సెహ్వాగ్, రిక్కీ పాంటింగ్ జాక్వస్ కల్లీస్ లాంటి ప్లేయర్లు టన్నుల కొద్దీ పరుగులు చేశారు.

టీ20లు ఉండగానే..తాజాగా కొత్త ఫార్మాట్‌ పుట్టుకొచ్చింది. అదే టీ10 లేదా టెన్‌ 10. కొత్త ఫార్మాట్ల పుట్టుకొస్తున్న కొద్దీ…పాత ఫార్మాట్లు కనుమరగవుతున్నాయి. టెస్టులు, వన్డే ఫార్మాట్లు లేకపోతే…క్వాలిటీ క్రికెటర్లు ఎలా పుట్టుకొస్తారు. టెస్టు, వన్డే ఫార్మాట్ ఎలా మనగలుతుంది. అంతా టీ20 ఫార్మాట్‌లో కొట్టుకుపోతున్నారు. టెస్టు, వన్డే ఫార్మాట్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్నాయి. ఆట కంటే ఆదాయ ఆర్జనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు స్పెషలిస్టు ప్లేయర్లు…దేశ జాతీయ జట్టుకు దూరమవుతున్నారు. కానీ అదే ప్లేయర్లు విదేశాల్లో డబ్బు కోసం పొట్టి ఫార్మాట్ ను ఆడుతున్నారు. ప్రస్తుతం క్రికెట్ లోకి వస్తున్న ప్లేయర్లు కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయడం లేదు. పొట్టి ఫార్మాట్ కు అలవాటు పడిన ప్లేయర్లు…ఐదు రోజుల మ్యాచ్ లు ఆడమంటే ఎలా ఆడుతారు ? రోజంతా క్రీజులో ఉండమంటే అది సాధ్యమయ్యే పనేనా ? టీ20ల కారణంగా టెస్టు, వన్డే ఫార్మాట్లు ప్రమాదంలో పడ్డాయి. 5రోజులు జరగాల్సిన టెస్టు…మూడు మూడ్రోజుల్లోనే ముగుస్తోంది. టీ20లను తగ్గించకపోతే…భవిష్యత్ లో టెస్టు మ్యాచ్ లు ఆడేవారే ఉండరు.