మనిషి చనిపోయాక.. తనతోపాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయ్. లేదంటే చితిలో కాలి బూడిదవుతాయ్. అలాంటిది మరోసారి బతకాలంటే.. మరొకరికి బతుకు ఇవ్వాలంటే.. అవయవదానమే మార్గం. అన్ని దానాల కన్నా ప్రాణదానం ముఖ్యం. అది జరగాలి అంటే.. అవయవాలు దానం చేయాలి. అవయవ దానంతో చనిపోయిన తర్వాత కూడా బతకొచ్చు. అవయవాలన్నీ వేరొకరి శరీరంలో ఉండటంతో.. చనిపోయినా బతికినట్లే లెక్క. ఐతే అవయవ దానంపై ఇప్పటికీ చాలా మందిలో రకరకాల విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఉన్నాయ్. అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికీ వెనకడుగు వేస్తున్న వాళ్లు ఎందరో! అవయవ దానంపై గౌరవం పెరిగేలా.. నమ్మకం కలిగించేలా.. తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు కారణం అవుతోంది.
ముఖ్యమంత్రిగా స్టాలిన్ పగ్గాలు అందుకున్న తర్వాత.. పాలనతో తన మార్క్ క్రియేట్ చేశారు. అందరితో పాటే సీఎం కాన్వాయ్ అని.. తనను ఎవరు పొగిడినా కఠిన చర్యలు ఉంటాయని.. ఇలాంటి నిర్ణయాలతో ది బెస్ట్ సీఎం అనిపించుకున్నాడు. ఆపదలో ఉంటే దేవుడు వస్తాడో రాడో కానీ.. స్టాలిన్ వస్తాడు అన్నట్లుగా.. జనాల్లో నమ్మకం క్రియేట్ చేశారు ఆయన. అలాంటి స్టాలిన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. అవయవ దానంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని.. విషాదకర పరిస్థితుల్లో ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని స్టాలిన్ అన్నారు.
చనిపోయిన తర్వాత అవయవదానం చేయటం వల్ల.. ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలని కోరారు. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలని.. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాలిన్ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.