ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయి మెజార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకే తెలంగాణలోనూ తమ పార్టీకి మళ్ళీ ప్రాణంలో పోయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ, ఇప్పుడు లోక్ సభ ఎన్నికలతో పతనావస్థలోకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగింది టీడీపీ. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ టీడీపీ అంతరించిపోయింది. చాలామంది లీడర్లు బీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ టీడీపీ కార్యకర్తల బలం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ స్థానాన్ని టీడీపీతో భర్తీ చేయాలని అనుకుంటున్నారు. అటు కేసీఆర్ ను నమ్ముకొని గులాబీ పార్టీలో చేరిన టీడీపీ నేతలు కూడా తమ భవిష్యత్తుపై బెంగతో ఉన్నారు. క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది. వీళ్ళంతా మళ్ళీ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఏపీలో ఎలాగూ NDA కూటమి వర్కవుట్ అయింది. ఇదే ఫార్ములాతో తెలంగాణలోనూ నెక్ట్స్ అధికారంలోకి రావొచ్చన్న ఆలోచన టీడీపీ నేతల్లో ఉంది. పవన్ కల్యాణ్ కి ఏపీలోనే కాదు… తెలంగాణలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ సరైన నాయకత్వం, గైడెన్స్ లేకపోవడంతో పవన్ ఇమేజ్ ని ఓట్ల రూపంలో జనసేన క్యాష్ చేసుకోలేకపోతోంది. కూటమిగా ఏర్పడితే… టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్స్ తో తెలంగాణలో అధికారం దక్కుతుందన్న ధీమా కనిపిస్తోంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. దాంతో టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు బాబు సీఎంగా ప్రమాణం చేశాక… ముందు టీటీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేపట్టే అవకాశముంది. అందుకోసం సమర్థుడైన లీడర్ కోసం వెతుకుతున్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం, బీఆర్ఎస్ పతనంతో టీడీపీ ఆ స్థానం భర్తీ చేసే ఛాన్స్, పవన్ కల్యాణ్ ఇమేజ్… ఈ మూడు కలిస్తే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.