ప్రస్తుత టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేనికి ఒళ్లు మండిపోతోంది. అది కూడా నార్మల్‌గా కాదు.. ఆయన్ను ముట్టుకుంటునే మసి అయిపోతాం ఏమో అని భయం వేసే అంతలా నాని ఫుల్ హీట్ మీదున్నారు. టైమ్ దొరికితే చాలు చంద్రబాబుతో పాటు ఆయన అభిమాన అనుచరులపై నిప్పులు కక్కుతున్న కేశినేని..తాజాగా మరోసారి టీడీపీ నాయకులు, ఇన్‌ఛార్జ్‌లపై ఫైర్ అయ్యారు. ‘గొట్టంగాళ్లు.. వాళ్లంతా గొట్టంగాళ్లు.. గొట్టంగాళ్లే’.. రాసుకోండంటూ మండిపడ్డారు. ఇప్పటికే ఆ గొట్టంగాళ్లు ఎవరో అర్థమయ్యే ఉండాలి.
తమ్ముళ్ల తన్నులాట:
ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. అది మార్చి 6, 2021.. విజయవాడ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్‌కు వెళ్లిన రోజు..! కేశినేని నాని ఒకవైపు.. బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరామరోవైపు. కేశినేని కూతురు శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మిగతా వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. బొండా ఉమా, బుద్దా వెంకన్నకు అప్పటివరకు ఉన్న నార్మల్ బీపీ హై బీపీకి వెళ్లిన రోజు అది. అంతా కలిసి బొండా ఉమా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని.. కేశినేనిపై కస్సుమన్నారు. తమ పార్టీ నేతనే నోటికొచ్చినట్టు చెడామడా తిట్టేశారు. “నానిని ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని”. “ఏ గొట్టం గాడు మాకు అధిష్టానం కాదు”. “టీడీపీని కుల సంఘంగా మార్చుతున్నాడు, పార్టీ ఎవరి జాగీరు కాదు”. ఇది కేశినేని నానిపై బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరా చేసిన వ్యాఖ్యలు.. సీన్ కట్ చేస్తే.. కేశినేని ‘గొట్టంగాళ్లు’ కామెంట్స్.
గొట్టంగాళ్లు.. గొట్టంగాళ్లు.. గొట్టంగాళ్లే:
కేశినేని నాని, టీడీపీ అధిష్టానం మధ్య పరోక్ష యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారి చాలా కాలం ఐపోయింది. కేశినేని నానికి అతని తమ్ముడు చిన్నికి మధ్య వైరం ఈనాటిది కాదు. పొమ్మనలేక పొగబెట్టడం ఆరితేరిన చంద్రబాబు..నానిని సాగనంపాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అందుకే చిన్నికి దగ్గరయ్యారు. తన కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండే బుద్ధా వెంకన్న లాంటి నేతలలో నానిని తిట్టించారు. చాలా కాలంగా వీటిని సహిస్తూ వస్తున్న కేశినేని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. పొమ్మనలేక పొగపెడుతు ఉండొచ్చని.. అయితే ఇప్పటికే 50శాతమే ఆ హీట్ తన బాడీకి తాకిందని.. ఈ మీటర్ 100శాతం టచ్ అవ్వగానే పార్టీ మారే విషయం ఆలోచిస్తానని కుండబద్దలు కొట్టారు కేశినేని. మంచిగా ఉంటే ఏ పార్టీ నుంచైనా ఆఫర్లు వస్తాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం అన్ని పార్టీలతోనూ మంచి ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తే తప్పేముందని రివర్స్ అటాక్ చేశారు.
మహానాడుకు ఆహ్వానం లేదు:
ఇటివలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేశినేని నేరుగా టీడీపీ అధినేతనే టార్గెట్ చేసేలా డైలాగులు వేయడం కాక రేపింది. లోఫర్లకు , డాఫర్లకు టిక్కెట్లివ్వొద్దని డైరెక్ట్‌గా చంద్రబాబుకే చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కామెంట్స్ తన సోదరుడు కేశినేని చిన్నిని ఉద్ధేశించే చేశాడని క్లియర్‌కట్‌గా అర్థమయ్యాయి.బహిరంగ సభల్లో.. లేకపోతే మీడియా ముందు కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబను మరింత ఇరుకున పెట్టేలా ఉండడంతో ఆయన్ను మహానాడుకు కూడా పిలవలేదు టీడీపీ. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదన్న విషయాన్ని ఇటు కేశినేని కూడా స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ ఇంజార్జ్‌లపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కేశినేని. పార్టీలో అంతర్గత అరెంజ్‌మెంట్ కోసం ఇంచార్జిలను పెట్టుకుంటారని అవేమి రాజ్యాంగ పదవులు కాదన్నారు. విజయవాడ ప్రజలు తనను కావాలని కోరుకుంటున్నారని, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యమని, మధ్యలో ఇంఛార్జిలు అని వచ్చే గొట్టంగాళ్లు ఎవరన్నారు. కేశినేని భవన్ వద్ద ఉన్న బ్యానర్లను చూపిస్తూ.. అందులో ఉన్న గొట్టంగాళ్ల కోసం తాను పని చేయాల్సి వస్తుందని నేరుగా బొండా ఉమా, బుద్దా వెంకన్నను టార్గెట్ చేశారు కేశినేని. ప్రజలు ఆశీర్వదిస్తే ఇండిపెండెంట్‌గా అయినా తాను గెలుస్తానంటూ ఆయన చేసిన మరో కామెంట్‌తో టీడీపీని కేశినేని వీడడం ఖాయమన్న విషాయన్ని స్పష్టం చేస్తోంది.