ప్రస్తుతం టీమిండియా అభిమానులకు టెన్షన్ కలిగిస్తున్న ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత అయ్యర్ ఏమాత్రం రాణించడం లేదు. బ్యాటింగ్ విషయం పక్కన పెడితే కనీసం ఫీల్డింగ్ కూడా సరిగా చేయడం లేదు. చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలపాలు చేస్తున్నాడు. ఆసియా కప్‌లో నేపాల్‌తో మ్యాచులో ఇలాగే చేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కూడా అయ్యర్ ఇలాంటి పొరపాటే చేశాడు. డేవిడ్ వార్నర్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇక బ్యాటింగ్‌లో కూడా పెద్దగా రాణించలేదు. క్రీజులోకి వచ్చిన కాసేపటికే రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఇదంతా చూసిన అభిమానులు రీఎంట్రీలో అయ్యర్ ఇప్పుడప్పుడే మళ్లీ ఫామ్ అందుకోవడం జరగదని ఫీలవుతున్నారు.
ఇలాంటి ఆటగాడితో వరల్డ్ కప్‌లో అడుగు పెడితే పెద్ద సమస్య వస్తుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఫిక్స్ అయ్యాడు. ఇక ఐదో స్థానంలో మంచి బ్యాటర్ అవసరం ఉంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఈ స్థానంలో ఆడుతున్నాడు. అయినా సరే అయ్యర్‌పై నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్ అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తోంది. కానీ ప్రస్తుతం అయ్యర్ ఆటతీరు చూస్తే అతను జట్టుకు యూజ్ అవుతాడనే నమ్మకం ఏమాత్రం కలగడం లేదు. ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ ఇవ్వగానే అతనికి మళ్లీ వెన్నునొప్పి వచ్చింది. దీంతో ఆ టోర్నీ ఫైనల్ వరకు అతను మళ్లీ ఆడలేదు.
ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీసులో ఆడిన మ్యాచులో ఫెయిలయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో జరిగే రెండో వన్డే అతనికి చావోరేవోగా మారింది. రెండో వన్డేలో కూడా అయ్యర్ ఫెయిలైతే అతని స్థానాన్ని ఇషాన్ కిషన్‌కు ఇచ్చేయాలని టీం మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే అయ్యర్ రిప్లేస్‌మెంట్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో ఎడం చేతి వాటం బ్యాటర్ అవసరం ఉందని భావిస్తే కిషన్‌ను వరల్డ్ కప్‌లో కూడా ఐదో నెంబర్‌లో కొనసాగిస్తారని తెలుస్తోంది. కాబట్టి రెండో వన్డేలో ఫెయిలైతే ఇక అయ్యర్‌కు ఛాన్స్ లేదని వార్తలు వస్తున్నాయి.