పెర్త్ లో రెండోరోజు మనదే, భారీ ఆధిక్యంలో టీమిండియా

పెర్త్ టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. తొలిరోజు బ్యాటింగ్ లో త్వరగానే ఆలౌటైనా... వెంటనే బౌలర్లు చెలరేగి ఆసీస్ ను కట్టడి చేశారు. రెండోరోజు తొలి సెషన్ లో కాస్త ఆలస్యమైనా కంగారూలను ఆలౌట్ చేసి కీలకమైన ఆధిక్యాన్ని అందుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 05:15 PM IST

పెర్త్ టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. తొలిరోజు బ్యాటింగ్ లో త్వరగానే ఆలౌటైనా… వెంటనే బౌలర్లు చెలరేగి ఆసీస్ ను కట్టడి చేశారు. రెండోరోజు తొలి సెషన్ లో కాస్త ఆలస్యమైనా కంగారూలను ఆలౌట్ చేసి కీలకమైన ఆధిక్యాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ హాఫ్ సెంచరీలతో రాణించి టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలబెట్టారు. రెండోరోజు ఆటలో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆరంభంలో ఆసీస్ టెయిలెండర్లను త్వరగా ఔట్ చేయలేకపోవడం ఒక్కటే మనకు మైనస్ పాయింట్. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని త్వరగానే పెవిలియన్ కు పంపినా… స్టార్క్ , హ్యాజిల్ వుడ్ భారత్ ను విసిగించారు. ముఖ్యంగా స్టార్క్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ స్కోరును వంద దాటించాడు. ఫలితంగా భారత్ కు అనుకున్నంత ఆధిక్యం దక్కలేదు. కంగారూలు 104 పరుగులకు ఆలౌటవగా… భారత్ కు 46 పరుగుల లీడ్ వచ్చింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా 5 వికెట్లు తీయగా… హర్షిత్ రాణా అరంగేట్రంలోనే 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.

తర్వాత పేస్ పిచ్ పై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ నిలకడగా ఆడింది. టెస్టుల్లో ఎలా ఆడితే సక్సెస్ అవుతామో ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ చూపించారు. తొలి ఇన్నింగ్స్ లో చేసిన తప్పిదాన్ని రిపీట్ చేయకుండా జైశ్వాల్ చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్ల పేస్ ను సమర్థవంతంగా డిఫెన్స్ చేసి పరుగులు రాబట్టాడు. వారికి చికాకు తెప్పిస్తూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అటు కెఎల్ రాహుల్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పరుగులు చేశాడు. ఫలితంగా రెండోరోజు పూర్తయ్యే వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆసీస్ బౌలర్లను తట్టుకుని నిలబడిన జైశ్వాల్, రాహుల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్ కు అజేయంగా 172 పరుగులు జోడించారు.

ఒకదశలో ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ వీరిజోడిని విడగొట్టలేక తలపట్టుకున్నాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లను బరిలోకి దింపాడు. చివరికి లబూషేన్ , ట్రావిస్ హెడ్ చేత కూడా బౌలింగ్ చేయించాడు. అయినప్పటకీ పట్టుదలగా ఆడిన జైశ్వాల్, రాహుల్ రెండోరోజు వికెట్ ఇవ్వకుండా ఆటను ముగించారు. ఫలితంగా రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 172 పరుగులు చేసింది. జైశ్వాల్ 90, రాహుల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉండగా… పెర్త్ పిచ్ పై 350 ప్లస్ టార్గెట్ ఉంచినా ఆసీస్ ను నిలువరించే ఛాన్సుంది. అయితే మూడోరోజు తొలి సెషన్ లో పేసర్లకు కాస్త ఎక్కువ అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో భారత బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంచి ఆధిక్యాన్ని సాధించడం మానసికంగా భారత్ కు అడ్వాంటేజ్. మొత్తం మీద మూడోరోజు కూడా మన బ్యాటర్ల హవా కొనసాగితే పెర్త్ టెస్టులో విజయం అందినట్టేనని చెప్పొచ్చు.