మూడో టెస్ట్ కూడా కృష్ణార్పణమేనా…?

టీం ఇండియాకి ఏమైంది? మళ్లీ అదే నిర్లక్ష్యం. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను తీసుకెళ్లి కివీస్‌కు అప్పగించినంత పని చేసింది టీమిండియా. మూడో టెస్ట్‌లో మొదటి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించినా.. చివరి 15 నిమిషాల్లోనే సీన్ రివర్స్ అయిపోయింది.

  • Written By:
  • Publish Date - November 2, 2024 / 11:29 AM IST

టీం ఇండియాకి ఏమైంది? మళ్లీ అదే నిర్లక్ష్యం. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను తీసుకెళ్లి కివీస్‌కు అప్పగించినంత పని చేసింది టీమిండియా. మూడో టెస్ట్‌లో మొదటి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించినా.. చివరి 15 నిమిషాల్లోనే సీన్ రివర్స్ అయిపోయింది. నాలుగు వికెట్లు పటపట రాలిపోతుంటే అసలు మన వాళ్ళకి ఏమైంది అని క్రికెట్ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ముంబైలోనూ టీమిండియా ఆటతీరు మారలేదు. కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం వచ్చినా దాన్ని చేజేతులా చెడగొట్టారు. బౌలర్లు రాణించినా బ్యాట్స్‌మెన్‌ మరోసారి ఫెయిలయ్యారు. రెండు టెస్టులు ఓడిపోయిన టీమిండియా.. మూడో టెస్టులో కివీస్‌ను చిత్తు చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.

65 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా న్యూజిలాండ్ బ్యాటింగ్ నీ కకావికలం చేశాడు. ఓవైపు జడేజా చెలరేగితే.. ఇంకోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా తగ్గేదే లే అంటూ వికెట్ల వేటలో దూసుకుపోయాడు. 81 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌లో ఇరగ దీశామనే ఆనందాన్ని భారత బ్యాట్స్మెన్ నీరు గార్చారు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ మరోసారి నిరాశపరిచాడు. 18పరుగులే చేశాడు. ఆ తర్వాత కాసేపు జైశ్వాల్‌, గిల్‌ ధాటిగా ఆడారు. అయితే జైశ్వాల్‌ని అజాజ్‌ పటేల్ బోల్తా కొట్టించాడు. నైట్‌ వాచ్‌మెన్‌గా వచ్చిన సిరాజ్‌ తొలి బంతికే వెనుతిరిగాడు.

ఇక కోహ్లీ కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత పంత్‌, గిల్‌ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా… పంత్… 60 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. తొలి రోజు ఆట చివర్లో 8 బంతులు 6 పరుగుల వ్యవధిలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదట శుభ్‌మన్ గిల్‌తో యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడాడు. రెండో వికెట్‌కు 51 పరుగుల జోడించిన అనంతరం యశస్వి జైస్వాల్ అనవసర రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో 4 ఓవర్లలో డే1 ఆట ముగుస్తుందనగా యశస్వి చేసిన ఈ తప్పిదం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది.

నైట్‌వాచ్‌మన్‌గా మహమ్మద్ సిరాజ్‌ను పంపించగా.. అతను గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో.. కింగ్ కోహ్లీ క్రీజ్‌లోకి రావాల్సి వచ్చంది. కోహ్లీ కూడా రనౌట్ కావడంతో.. టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి. భారత బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఈ టెస్ట్ కూడా న్యూజిలాండ్ కు అర్పించేటట్టు ఉన్నారు. నిజానికి ఎండ వేడితో న్యూజిలాండ్ టీం అల్లాడిపోతోంది. ఆ అవకాశాన్ని కూడా ఇండియా వినియోగించుకోలేకపోతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కనీసం 500 రన్స్ కొట్టకపోతే ఈ టెస్ట్ గెలవడం చాలా కష్టం. టాస్ గెలిచినా, ఓడిన భారత ఆట తీరు ఒకే రకంగా ఉంటుంది. అసలు వీళ్ళు ఓల్డ్ ఛాంపియన్స్ ఏనా డౌట్ పుట్టిస్తోంది టీం. అశ్వినింగ్స్ లో భారీ స్కోర్ కొట్ట లేకపోతే కనుక ముంబై టెస్ట్ కూడా న్యూజిలాండ్ కి అప్పగించి మూడు సున్నాతో సిరీస్ కోల్పోవలసి రావచ్చు. కాగా లంచ్ సమయానికి టీం ఇండియా 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. గిల్, జడేజా క్రీజ్ లో ఉన్నారు.