T20 World Cup : వరల్డ్‌కప్‌ను ముట్టుకోని మోదీ.. ఎందుకంటే…

టీమిండియా మెంబర్స్‌.. ప్రధాని మోదీని కలిశారు. టీ20 వాల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. భారత జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

టీమిండియా మెంబర్స్‌.. ప్రధాని మోదీని కలిశారు. టీ20 వాల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. భారత జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు. టీ20 వరల్డ్‌ కప్‌తో బార్బడోస్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి చేరుకున్న టీమిండియా ప్లేయర్స్‌తో మోదీ సమావేశం అయ్యారు. జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌.. కార్యక్రమంలో భాగంగా మోదీ.. క్రికెటర్లతో ప్రత్యేకంగా సంభాషించారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రదర్శన.. ఫైనల్ మ్యాచ్‌లాంటి అంశాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జట్టు సభ్యులతో కలిసి మోదీ ఫొటో దిగారు. ఇక్కడే ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫోటో దిగే సమయంలో టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని మోదీ తాకలేదు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ట్రోఫీని చెరోవైపు నుంచి పట్టుకోగా.. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రధాని వారి చేతులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతోంది. మోదీ చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్పోర్ట్స్‌లో ట్రోఫీలు అయినా.. పతకాలు అయినా.. గెలిచిన జట్లు లేదంటే అథ్లెట్లే వాటిని తాకాలని ఓ రూల్ ఉంటుంది. దానికి తగినట్లే. మోదీ కూడా ట్రోఫీకి తాకకుండా కోచ్, కెప్టెన్ల చేతులు పట్టుకోవడంతో.. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మోదీ చేసిన పని సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఇక టీ20 వాల్డ్‌కప్ నెగ్గిన భారత జట్టు.. జూన్ 30వ తేదీనే భారత్‌కు తిరిగి రావాల్సింది. ఐతే తుఫాన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయారు. మూడు రోజులు తమ హోటల్‌లోనే బస చేశారు. ఎట్టకేలకు అక్కడి పరిస్థితులు సద్దుమణగడంతో.. బీసీసీఐ ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, ఆటగాళ్లను భారత్‌కు తీసుకొచ్చింది. 16 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టారు. ఢిల్లీ గడ్డపై కాలుమోపగానే వారికి అపూర్వ స్వాగతం లభించింది.