టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఉత్తరఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కీ సమీపంలో హమందాపూర్ ఝల్ ప్రాంతంలో పంత్ ప్రయాణిస్తోన్న బీఏండబ్ల్యూ కారు అదుపుతప్పి వేగంగా రేయిలింగ్‌ను తగిలింది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన అనంతరం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించడంతో తృటిలో ప్రాణాలతో పంత్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటివరకు అద్భుతమైన ఫామ్ లో ఉన్న పంత్.. అకస్మాత్తుగా యాక్సిడెంట్ కావడంతో ఈ స్టార్ బ్యాటర్ ఈ ఏడాది బ్యాట్ పట్టనే లేదు. ఈ క్రమంలో ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ కూడా మిస్ అయ్యాడు. అయితే పంత్ త్వరలోనే జాతీయ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచార ప్రకారం పంత్ టీమిండియాలోకి త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
తాజాగా ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మీ నవ్వుతో వాటిని అంగీకరించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. దీంతో పంత్ రాక ఖాయంగా కనబడుతుంది. ఎన్నో కఠిన పరిస్థితుల నుండి కోలుకున్న పంత్ ఆత్మవిశ్వాసంతో కనబడుతున్నాడు. ప్రస్తుతం ఈ లెఫ్ట్ హ్యాండర్ పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ అకాడమీలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. టీమిండియా డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. పంత్ కు రెస్ట్ అవసరమని భావించిన సెలక్టర్లు సఫారీ టూర్ కు ఎంపిక చేయలేదు. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టుల సిరీస్ కు పంత్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.