Asia Cup 2023: నమ్మకం లేదు దొరా.. వాళ్ళిద్దరి మీదే భారం

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరో రెండు రోజుల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది.

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 02:01 PM IST

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరో రెండు రోజుల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. ఆగష్టు 30వ తేదీన ఆరంభ పోరులో ఆతిధ్య పాకిస్తాన్ జట్టుతో నేపాల్ తలపడనుంది. ఇక ఈ టోర్నమెంట్‌కు హైలైట్‌గా మారిన భారత్, పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు ఇప్పటికే బెంగళూరు క్యాంప్‌లో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇవన్నీ పక్కనపెడితే.. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన మ్యాచ్‌లు.. శ్రీలంక పిచ్‌లపై ఆడనుంది. అక్కడి పిచ్‌లు స్లో మాత్రమే కాదు.. స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తాయి.

ఈ క్రమంలోనే ఆ పిచ్‌లపై కొందరు టీమిండియా బ్యాటర్ల గత రికార్డులు చెత్తగా ఉన్నాయి. టర్నింగ్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై గిల్‌కు చెత్త రికార్డు ఉంది. వెస్టిండీస్ పర్యటనలో అది కొట్టోచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు తన వికెట్ సమర్పించుకుంటున్నాడు గిల్. సాధారణంగా గిల్ ఫ్లాట్ పిచ్‌లపై చెలరేగి ఆడతాడు. ఇక ఆసియా కప్‌లో.. అదీనూ శ్రీలంకలో ఫ్లాట్ పిచ్‌లు లభించడం చాలా కష్టం.

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. బంతితో అడపాదడపా రాణిస్తున్నా.. బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20ల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. స్లో పిచ్‌లపై హార్దిక్ పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. శ్రీలంక‌లో అన్నీ స్లో-పిచ్‌లు ఉండే అవకాశం ఉండటంతో.. హార్దిక్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నారు. పూర్తిగా ఫిట్‌నెస్ సాధించినప్పటికీ.. ఎలాంటి ప్రాక్టిస్ మ్యాచ్ ఆడకుండానే ఆసియా కప్‌లో ఆడనున్నారు. ఈ ఇద్దరూ ప్రధాన ఆటగాళ్లు కావడంతో.. ఎలా రాణిస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ సరైన ప్రదర్శన ఇవ్వలేదు. పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మరి ఆసియా కప్‌లో ఎలా ఆడతాడో చూడాలి. రోహిత్, కోహ్లీ.. మినహా మిగిలిన ప్లేయర్స్‌లో యెవరు ఎప్పుడు ఎలా ఆడతారో చెప్పడానికి కూడా కష్టమే. ఇక హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దొరకడం తక్కువే. సో‌… సీనియర్ ఆటగాళ్లు, విరాట్ రోహిత్ లో మీదే ఆసియా కప్ భారమంతా కొనసాగబోతుందని క్లియర్ గా అంచనా వేస్తున్నారు క్రికెట్ పండితులు.