RS Praveen Kumar: తెలంగాణలో బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సోమవారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సుడిగాలి ద్వారా టెంట్లు కూలిపోయాయి. తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. టెంట్‌లు ఎలా కూలిపోయాయో అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది. 3 కోట్ల బహుజన బిడ్డలు డబ్బులు ఇచ్చి మన రాజ్యం రావాలి కొట్లాడంది అంటున్నారు. వేములవాడలో ఆ దొర పోతే ఈ దొరలు వస్తున్నారు. బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు. వట్టే జానయ్యపై దాడి చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరు బహుజన బిడ్డలు ఏకం కావాలి.
KCR: ఆటోడ్రైవర్లకు కేసీఆర్ వరాలు.. ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటన..
దొరలు గాలి మోటార్లలో వస్తూ.. ఖాళీ జగాలు ఉన్నాయి, గుట్టలు ఎలా గుల్ల చేయాలి అని ఆలోచన చేస్తారు. మేము గాలి మోటార్‌లో వస్తే కింద చూసే ప్రతి భూమి పేద ప్రజలకి ఎలా పంచాలి అని చూస్తాము. ఇప్పటికే గోదాంలో డబ్బులు, మద్యం నిల్వలు ఉన్నాయి. దొరలు డబ్బులు పంచేందుకు ఓటుకు 2 వేలు పంచేందుకు వస్తారు జాగ్రత్తగా ఉండండి. దొరలకు ఓట్లు వేయకండి. ఒక్కసారి ఓటును అమ్ముకుంటే మన బిడ్డల జీవితాలను నాశనం చేసినట్టే. ఓటును అమ్ముకోవద్దు. దయచేసి, ఒక్కసారి ఏనుగు గుర్తుకు ఓటు వేయండి. బహుజన రాజ్యం వస్తే భూమి లేని మహిళ పేరిట ఒక్క ఎకరం ఇస్తాము. ఎన్ని రోజులు రోడ్లు ఊడ్వాలి..? దొరల గడిల దగ్గర పని చేయాలి..? దుబాయ్‌లో మన కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎంతో ఆశలు పెట్టుకొని వలస వెళ్లిన కుటుంబాల నుంచి అక్కడి ఏజెంట్ల మోసం వల్ల అక్కడ నుంచి శవాలు వస్తున్నాయి. దొరల కుటుంబాల్లో ఎందుకు కష్టాలు రావు, కేవలం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకేనా కష్టాలు..? రూ.100 కోట్లు ఢిల్లీకి పంపించి, రూ.20 లక్షల వాచ్ పెట్టుకుంది కవితమ్మ.
బహుజన పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి వాగ్దానాలను నెరవేరుస్తాం. కేసీఆర్ 40 వేల కోట్ల లిక్కర్ ఆదాయం మన నుంచి తీసుకుంటున్నారు. పది సంవత్సరాల నుంచి ఒకే పంట వేస్తే పంట దిగుబడి ఎలా రాదో.. అలాగే 10 ఏళ్లుగా ఒకే పంటకు తెగులు వచ్చింది. అందుకే పంట మార్చాలి. మిడ్ మానేరు నిర్వాసితుల్లో మొట్టమొదటి పరిహారం దొరకి వచ్చింది. అందుకే వడ్డించేది మన వాడు కావాలి. వేములవాడ రాజన్న ఆలయం నుంచి కామారెడ్డికి 9 కోట్ల రూపాయలు తరలించారు” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.