నమస్తే తెలంగాణ (Namaste Telangana) డైలీ పేపర్ పై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారంటూ ప్రచురించిన వార్తపై కాంగ్రెస్ MLC మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు FIR నమోదు చేశారు. ఆ పత్రిక తప్పుడు వార్తను ప్రచురించిందంటూ ఫిర్యాదులో తెలిపారు మహేశ్. ఈనెల 7న ఢిల్లీకి వెళ్ళే సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ – బాబు మీట్ అయినట్టు నమస్తే తెలంగాణలో వార్త పబ్లిష్ అయింది. వీళ్ళద్దరూ 2 గంటల పాటు సమావేశం అయ్యారని ఆ వార్తలో రాశారు. ఈ న్యూస్ నిజం కాదన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. 3 గంటల 7 నిమిషాలకు ఢిల్లీకి బయల్దేరారు. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు వచ్చారు. 3 గంటల ఏడు నిమిషాలకు వెళ్ళిపోయారు.
చంద్రబాబు (Chandrababu) బేగంపేట ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి రాకుండానే వెళ్ళిపోయారనీ, రేవంత్ రెడ్డి 10 నిమిషాలు మాత్రమే లాంజ్ లో ఉన్నట్టు మహేశ్ కుమార్ తెలిపారు. రేవంత్, బాబు మధ్యాహ్నం మూడున్నర నుంచి రెండు గంటల పాటు సమావేశం అయినట్టు నమస్తే తెలంగాణలో వార్త వచ్చింది. అసలు ఈ ఇద్దరూ కలుసుకోడానికి ఛాన్సే లేదనీ… తప్పుడు వార్తలు ప్రచురించడం నమస్తే తెలంగాణ (Namaste Telangana) కు అలవాటైందని మండిపడ్డారు మహేశ్ గౌడ్. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను ఆర్థిక సాయం చేయమని బాబు కోరారనీ…అందుకు ఒప్పుకున్నట్టు అందులో రాశారన్నారు మహేశ్ గౌడ్. చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ ఆడుతున్నారని నమస్తే తెలంగాణలో రాసినట్టు చెప్పారు.
ఈ వార్త సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే ఉద్దేశ్యంతోనే రాసింది. తెలంగాణ ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించేందుకు… రేవంత్, కాంగ్రెస్ నాయకత్వం ఇమేజ్ దెబ్బతీయడానికి నమస్తే తెలంగాణ వార్తను ప్రచురించిందని మండిపడ్డారు మహేశ్ కుమార్ గౌడ్. నిరాధార వార్తను పబ్లిష్ చేసి… రేవంత్ కి మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారనీ… చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.