తెలంగాణ వైద్యశాఖ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు JN1 కోవిడ్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికైతే హైదరాబాద్ లోనే అత్యధికంగా కోవిడ్ (Covid cases) కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 63 కేసులు వచ్చాయి. వీటిల్లో ఒక్క హైదరాబాద్ లోనే 53 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారు. సిటీలో టెస్టులు చేసయించుకునే వారి సంఖ్య పెరగడం వల్లే కేసులు బయటపడుతున్నాయని అంటున్నారు. జిల్లాల్లో కూడా వందల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నా…పాజిటివ్ కేసుల వివరాలను బులిటెన్ లో చూపించడం లేదు వైద్యశాఖ. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా సర్కారు లెక్కలు ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న కేవలం 8 కేసులు వచ్చినట్లు కరోనా బులిటెన్ విడుదల చేశారు. మొత్తం 1333 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 8 కేసులే పాజిటివ్ అని తేలుస్తూ బులిటెన్ రిలీజ్ చేశారు వైద్యశాఖ అధికారులు. ఈ బులెటిన్ లో వాస్తవాలు చూపిస్తున్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 59 యాక్టివ్ కరోనా కేసులు ఉననాయి. మిగతా వారు డిశ్చార్జ్ అవ్వగా.. నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చినట్టు సమాచారం. మంగళవారం ఇద్దరు కరోనాతో చనిపోయారు. అయితే వాళ్ళకి వేరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నట్టు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
సర్కారు చెబుతున్న కరోనా లెక్కలను లైట్ తీసుకుంటున్నారు జనం. JN1 కరోనా వేరియంట్ డేంజర్ కాదు గానీ… ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరో నాలుగు రోజుల్లో న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి. ఈవెంట్స్ లో, ఇళ్ళల్లో జనం భారీగా గుమికూడే అవకాశముంది. దాంతో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతాయనే టెన్షన్ లో ఉంది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎక్కువ మంది గుడికూడే చోట మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని సూచిస్తున్నారు డాక్టర్లు. శానిటైజర్ వాడటం లేద చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేయాలని చెబుతున్నారు.