బిగ్ బాస్ షో పిటీషన్ పై తెలంగాణా హైకోర్ట్ సంచలనం, అక్కడే తేల్చుకోండి

హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - December 11, 2024 / 01:36 PM IST

హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ షోకు రేటింగ్ కూడా భారీగా పెంచారు. ఎలాగైనా ఈ షోలో పాల్గొనాలని సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు అలాగే సినిమా పరిశ్రమలో అవకాశాలు లేని వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయితే క్రమంగా ఈ షో అసభ్యకరంగా ఉంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతూ వచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండే కొన్ని సన్నివేశాలను తొలగించాలి అనే డిమాండ్ కూడా వినపడుతూ వచ్చింది. బిగ్ బాస్ షో రేటింగ్ కోసం అసభ్యకరమైన సన్నివేశాలను చూపిస్తున్నారని… యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లను తీసుకువచ్చేసి స్కిన్ షో కూడా చేయిస్తున్నారు అని ఆరోపణలు కూడా వినిపించాయి.

2024 బిగ్ బాస్ సీజన్ లో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక పిటీషనర్ హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేశాడు. రియాలిటీ షో ప్రసారాన్ని నిలిపివేయాలని ఆయన హైకోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… ఆ ప్రోగ్రాం అసభ్యంగా ఉందంటూ కొన్ని ఫోటోలు చూపించి షో ఆపివేయాలని కోరడం సమంజసం కాదని, అది సాధ్యమయ్యే పని కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్ కు అసభ్యంగా అనిపించిన సదరు సన్నివేశాలు ఇతర ప్రజలకు అసభ్యం కాకపోవచ్చు అని హైకోర్టు అభిప్రాయబడింది.

అయితే కేబుల్ టీవీ నియంత్రణ చట్టం ప్రకారం సంబంధిత అధికారుల ముందు పిటీషనర్ తన అభ్యంతరాలను లేవనెత్త వచ్చంటూ హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8… 15వ వారం నడుస్తోంది. తాజాగా గత వారం విష్ణుప్రియ షో నుంచి ఎలిమినేట్ అయింది. వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ షోను ఓటిటి ఫ్లాట్ ఫాం హాట్ స్టార్ లో చూసేవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మన తెలుగుతో పాటుగా కన్నడ తమిళ భాషల్లో కూడా ఈ షోకు మంచి పాపులారిటీ వచ్చింది. అటు మలయాళం లో కూడా ఈ షోకు మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో విజయసేతుపతి కన్నడలో కిచ్చా సుదీప్ ఈ షోకు హోస్ట్ గా ఉన్నారు.