BJP Candidates: కాంగ్రెస్‌ మీదే ఆశలు పెట్టుకున్న బీజేపీ!

బీజేపీలోకి ఆశావాహులను గాలం వేసేందుకు సిద్దమైంది బీజేపీ.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 02:11 PM IST

కారుకు, కమలానికి జరిగిన యుద్ధం అంతా ఇంతా కాదు. రెండు పార్టీల నేతలు ఎదురుపడితే దాడులు చేసుకుంటారేమో అనిపించింది ఆ మధ్య ! కాంగ్రెస్ పని ఖతమ్ అయింది.. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే అనుకున్నారు. ఈ మాటకు బలం చేకూరేలా.. కేసీఆర్‌ కూడా ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేస్తూ కనిపించారు. దీంతో నిజంగానే కాంగ్రెస్‌ వీక్ అయిందా అనే చర్చ జరిగింది. కట్‌ చేస్తే.. కర్ణాటక ఫలితంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్‌లో మళ్లీ జోష్‌ కనిపించింది. వలస నేతలంతా.. గాంధీభవన్‌ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. బీజేపీ నుంచి ఒక్కో నాయకుడు జారుకోవడం స్టార్ట్ చేశారు. ఇది సరిపోదన్నట్లు.. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైమాండ్. దీంతో బీజేపీ ఫాలింగ్ స్టార్ట్ అయింది.

ఈ మధ్య కమలం పార్టీ పరిస్థితి మరింత దారుణం అయింది. వచ్చేవాళ్లు రాకపోగా.. ఉన్నవాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోతున్న సీన్ కనిపిస్తోంది బీజేపీలో. ఎన్నికల సమయానికి ఎలాగైనా బలం పుంజుకోవాలని ఫిక్స్ అయిన బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున పోటీచేయటానికి మెజారిటీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు లేరు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు గాలమేస్తోంది. ఎన్నిసార్లు గాలమేసినా ఎవరు చిక్కడం లేదు. దీంతో చివరి ఆశగా కాంగ్రెస్ వైపు చూస్తోంది. బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే 115మంది అభ్యర్ధులను కేసీఆర్‌ ప్రకటించారు. ఏడుగు సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వలేదు. వీళ్లతో పాటు టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుని భంగపడ్డ ఆశావహుల్లో కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఐతే అసంతృప్తులంతా తమ వైపు వస్తారని బీజేపీ నేతలు ఎవరికి వారు అంచనా వేశారు. ఐతే సీన్ మాత్రం రివర్స్ అయింది.

దీంతో అందరి అంచనాలు తల్లకిందులైపోయాయి. బీఆర్ఎస్ అసంతృప్త నేతల్లో బీజేపీ వైపు వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరని అర్ధమైపోయింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోంది బీజేపీ. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా విడుదల కాబోతోంది. మొదటి జాబితాలో టికెట్లు దక్కని వాళ్ళు, ఆశావహులు తమ పార్టీలో చేరుతారని కమలనాదులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ జాబితాను ఎప్పుడు ప్రకటిస్తుందా.. ఎప్పుడు గొడవలు అవుతాయా అని బీజేపీ పెద్దలు వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలే.. చాలాచోట్ల బీజేపీకి దిక్కు అయ్యేలా కనిపిస్తున్నారు. అలా అని టికెట్లు రాని నేతలంతా వెంటనే.. కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీలో చేరుతారనే గ్యారంటీ లేదు. కాకపోతే టికెట్లు దక్కని వాళ్లు, దక్కుతాయనే ఆశలు వదిలేసుకున్న నేతలు.. తమ పార్టీలో చేరకపోతారా అని బీజేపీ నేతల ఆశలు పెట్టుకున్నారు.