దీంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంది. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 34వేల 352 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈసారి అంతకుమించి రికార్డులు బ్రేక్ అయ్యాయ్. తెలంగాణలో మే నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఏకంగా ఖజానాకు 3వేల 285 కోట్ల ఆదాయం వచ్చింది. మే 31వ తేదీ ఒక్కరోజే 3వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయ్. ఎండలు మండిపోతుండడంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.
ఏప్రిల్‌లో వర్షాలు కురవడంతో బీర్ల అమ్మకాలు గతేడాదికంటే తగ్గాయి. మేలో భానుడు భగ్గుమనడంతో మందుబాబులో బీర్లను నీళ్లలా తాగేశారు. మే నెలలోనే 64లక్షల 48వేల కేసులకు పైగా బీర్ల అమ్మకాలు జరిగాయి. ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, అన్ని బ్రాండ్ల మద్యం దొరక్కపోవడంతో అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారు దొంగచాటుగా అధికారులకు చిక్కకుండా మద్యం తీసుకెళుతున్నారు. తెలంగాణలో మద్యం సేల్స్ భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు బద్దలు కొడుతున్నాయ్. ఐతే ఇది బంగారు తెలంగాణనా.. తాగుబోతుల తెలంగాణనా అని.. విపక్షాలు భగ్గుమంటున్నాయ్.