Minister KTR: యువరాజు పుట్టినరోజా మజాకా.. తెలంగాణకు పండగ రోజులా ఉంది..

తెలంగాణలో ప్రస్తుతం నడిచేది రాజరికమే అంటే ఒప్పుకోరు చాలామంది. రాజు, యువరాజు, యువరాణి, బుల్లి యువరాజు, రాజు గారి మేనల్లుడు, రాజుగారు తమ్ముడి కొడుకు.. ఇలా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు సంస్థానాలు, రాజుల వ్యవస్థలో చూశాం ఇవన్నీ! పూర్తిగా అదే కాకపోయినా.. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే చూస్తున్నాం.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 07:55 PM IST

జులై 24న కేటీఆర్ పుట్టినరోజు. బీఆర్ఎస్‌ నేతలకు ఇది పెద్ద పండగ రోజు. కేసీఆర్‌ కుటుంబమే చెప్పి చేయించుకుందో.. బీఆర్ఎస్‌లో నేతలు తమకు తాముగా చేశారో తెలియదు కానీ.. కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు మాత్రం ఏ ఏడాదికా ఏడాది అదిరిపోతుంది. పేపర్ల నిండా ప్రకటనలు, ఆలయాల్లో పూజలు, టీవీల నిండా చైతన్య, నారాయణ ఇంటర్ రిజల్ట్స్‌ మించి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు, కేక్ కటింగ్‌లు.. అబ్బో మాములుగా లేదు హడావుడి అంతా ! ఒక ముఖ్యమంత్రి కొడుకు.. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఒక మంత్రి.. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఇవన్నీ కలుపుకొని చూసినా కూడా కేటీఆర్ పుట్టినరోజుకి ఇంత హంగామా అవసరమా అనిపిస్తోంది.

ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అంటే రాజులు, యువరాజులే.. అందులో డౌటే లేదు ! కానీ బర్త్‌డేకి కూడా ఇదేం హంగామా.. కేసీఆర్‌ బర్త్‌ డే ప్రకటనల్లో.. మన బుల్లి యువరాజు హిమాన్షుని కూడా వదిలిపెట్టలేదు భజన సంఘాలు. పిల్లగాని ఫొటో వేసి మరీ 2050లో మన ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు. తన పుట్టినరోజుకి ఎలాంటి పేపర్ యాడ్‌లు ఇవ్వొద్దు.. ఆ డబ్బు అనాథల కోసం ఖర్చు చేయాలని కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఐనాసరే బీఆర్ఎస్‌లో బీటీ బ్యాచ్ ఒప్పుకుంటారా ? అప్పటివరకు ఆయన పుట్టినరోజు మర్చిపోయిన లీడర్లు కూడా.. ఊరికి ఊరికి మరీ ప్రకటనలు గుప్పించారు. మీడియాలో బీఆర్ఎస్‌కు చెందిన పత్రికలు, టీవీలు అయితే.. కేటీఆర్ భజనతో చెలరేగిపోయారు. అసలు కేటీఆర్ అనే వ్యక్తి ఒక కారణజన్మడని.. ప్రపంచపటంలో తెలంగాణకి గుర్తింపు తెచ్చింది కేటీఆర్ అని.. అబ్బబ్బా.. ఒకటి కాదు, తెగ పొగడ్తలతో ముంచేత్తేశారు.

ఇదంతా ఓకే కానీ.. కేటీఆర్ మంత్రి కాకముందు.. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకముందు.. పుట్టినరోజు ఎందుకింత ఘనంగా చేయలేదు. ఈ పులిహోర లీడర్లంతా ఏమయ్యారు అంటే సమాధానం దొరకదు. అధికారాంతమున చూడవలె అయ్యవారి వైభవం అన్నట్లు… అధికారంలో ఉన్నప్పుడు పులిహోర సంఘాలు.. భజనగాళ్లు మామూలే ! కాకపోతే కేసీఆర్‌ మార్క్ రాజకీయ వ్యవస్థలో అది ఇంకా ఎక్కువ అయిపోయింది. కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో అది క్లియర్‌గా కనిపించింది. ఎలక్షన్ ఇయర్ కదా.. యువరాజును కీర్తించడంలో ఎవరూ తగ్గలేదు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆరేనని.. ఆ మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈ వ్యూహాత్మక ప్రచారం కూడా ఉపయోగపడుతుంది. కానీ కోట్లు ఖర్చుపెట్టి లీడర్లు పేపర్‌లో, టీవీల్లో ఎందుకు కేటీఆర్‌కి శుభాకాంక్షలు చెప్తున్నారో.. సామాన్య జనాలకు మాత్రం అర్థం కావడం లేదు.