Telangana Politics: రేవంత్‌, బండి సంజయ్‌కు ఫోన్.. షర్మిలక్కను వీళ్లు పట్టించుకుంటారా ?

మాటలతో, అడుగులతో దూకుడు పెంచిన షర్మిల.. ఇప్పుడు మరో రాజకీయ ఎత్తుగడ వేశారు. ఏడాదిన్నరగా షర్మిల పోరాడుతున్నా.. పాదయాత్రలు చేస్తున్నా.. ఆందోళనలకు దిగుతున్నా.. జనాల్లో ఆదరణ దక్కడం లేదు. దీంతో ఈసారి కొత్త రూట్ ఎంచుకున్నారు. నిరుద్యోగ సమస్యను ఎత్తుకున్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీక్‌పై యుద్ధం మొదలుపెట్టారు. దీనికోసం కొత్త స్కీమ్‌ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీతో కలిసి పోరాటం చేయడానికి రెడీ అయ్యారు షర్మిల.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 07:30 PM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. రాజకీయంగా ఇది ఆసక్తి రేపుతోంది. ఓ పార్టీ చీఫ్‌గా ఉంటూ.. విధానాలపరంగా ఇతర పార్టీల అధ్యక్షులకు ఫోన్ చేసి ఉమ్మడిగా ఉద్యమం చేద్దామని పిలుపు ఇవ్వడం.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశరాజకీయాల్లోనే ఈ మధ్య మొదటిసారి ! ఇదంతా సరే.. షర్మిల పిలిచారు కదా అని.. ఇప్పుడు ఆ ఇద్దరు పోరాడేందుకు వస్తారా అంటే.. అంత సీన్ లేదు. ఆ రెండు పార్టీలకు ఎవరి ఎజెండా వారికి ఉంది.

ఇంత పెద్ద వివాదంలో వేరే పార్టీతో కలిసి పోరాడి.. క్రెడిట్‌ తీసుకునేందుకు ఇష్టపడతారా అంటే.. దాదాపు అసాధ్యం అది ! అందులోనూ వైటీపీలాంటి చిన్న పార్టీతో కలిసి.. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి పోరాడతాయి అనుకోవడం.. ఆకాశానికి సున్నం వేసినట్లే ! నిజానికి ఈ విషయం షర్మిలకు కూడా తెలుసు. పొలిటికల్‌ చర్చగా మిగిలేందుకు మాత్రమే షర్మిల కాల్ చేశారు. ఈవిడ ఫోన్ చేశారు కదా అని వాళ్లు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అంతే.. ఖేల్‌ ఖతమ్ దుక్నం బంద్. ఇది ఇక్కడితోనే ఎండ్‌ కావడం ఖాయం. లేదు.. వైటీపీతో కలిసి పోరాటం చేస్తామంటే మాత్రం.. బీజేపీ, కాంగ్రెస్‌ వెళ్లి పప్పులో కాలు వేసినట్లే అన్నది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం.