కాంగ్రెస్ సత్తా చాటిందా లేదా బౌన్స్‌బ్యాక్ అయిందా లేదా అన్నదే అసలు సంగతి ! ఇదంతా ఎలా ఉన్నా.. కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బీజేపీకి ఊపిరాడకుండా చేస్తోంది. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది ఇక్కడ ! బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. బీఆర్ఎస్‌లో అసంతృప్తులు, కాంగ్రెస్‌లో తిరుగుబాటుదారులు అంతా కలిసి జంబో ప్యాక్‌లాగా తమ పార్టీలోకి వచ్చి చేరుతారని బీజేపీ నేతలు వేసిన లెక్కలు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. తెలంగాణలో బీజేపీ పూర్తిగా డీలా పడిపోయిందా అనిపిస్తోంది పరిస్థితి.
కర్ణాటక ఓటమితో.. ఇప్పటివరకు తెచ్చిపెట్టుకున్న హైప్ అంతా క్లియర్ అయిపోయింది. జూపల్లి, పొంగులేటి మీద బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. వాళ్లు రాకపోగా.. రివర్స్ మోటివేట్ చేసి బీజేపీలో ఉన్న ఇంకొందరు నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే బీజేపీకి వెళ్దామనుకున్న నేతలు కూడా.. ఇప్పుడు గాంధీభవన్ వైపు అడుగులు వేస్తున్నారు చిన్నగా ! ఒక్క ముక్కలో చెప్పాలంటే బీజేపీ చేరికల వ్యూహం అట్టర్‌ఫ్లాప్ అయింది. ఏం చేయాలో తెలియక.. ఎలా వెళ్లాలో అర్థం కాక బీజేపీ నేతలు గందరగోళంలో పడిపోయారు. వస్తారు అనుకున్న వాళ్లు రాకపోవడం కాదు.. ఉన్న వాళ్ల కూడా పోయేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇలాంటి సమయంలో తెలంగాణలో పార్టీ సెట్‌రైట్ కావాలంటే.. మోదీ, అమిత్ షా బరిలోకి దిగాల్సిందే అనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులుగా.. బీజేపీలో టాప్ 2లో ఉన్న నేతలుగా.. మోదీ, అమిత్ షా బరిలోకిగి దిగితే తప్ప పార్టీలో పరిస్థితులు సర్దుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఆ ఇద్దరికి ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలు చేరవేర్చారని టాక్. మోదీ సంగతి ఎలా ఉన్నా.. త్వరలో అమిత్ షా హైదరాబాద్‌కు మకాం షిప్ట్ చేయనున్నారు.
నిజానికి కర్ణాటక ఎన్నికల తర్వాతే రావాల్సి ఉన్నా.. ఆ ఫలితంపై పోస్టుమార్టం చేసే ప్రాసెస్‌లో ఇంకొద్దిరోజులు ఢిల్లీకే పరిమితం కావాల్సి వచ్చింది. త్వరలో అమిత్ షా.. తెలంగాణ మీద ఫోకస్ పెంచబోతున్నారని.. మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరపడంతో పాటు.. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు సభల్లోనూ పాల్గొంటారని బీజేపీ నేతలు అంటున్నారు. నిజానికి ఇద్దరి ప్రభావం నార్త్ రాజకీయాల్లో ఎక్కువ ఉంటుంది. దక్షిణాది రాజకీయాలు, అందులోనూ తెలంగాణలో సీన్ పూర్తిగా తేడా ! మరి ఆ ఇద్దరు దృష్టిసారించి.. బరిలోకి దిగితే బీజేపీ ఫేట్ మారుతుందా అంటే.. వెయిట్ అండ్ సీ !