Nara Lokesh: మీడియా సమావేశంలో లోకేశ్ భావోద్వేగం

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ కీలక నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.

  • Written By:
  • Updated On - October 21, 2023 / 04:18 PM IST

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తన తండ్రిని గత 42 రోజులుగా జైల్లో ఉంచిన కారణంగా పార్టీ భవిష్యత్ కార్యచరణపై విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. తదనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఆవేదనతో కూడిన స్వరంతో ప్రస్తుతం జరుగుతున్న దురాగతాలపై గొంతెత్తారు.

టీడీపీకి రాజకీయ సంక్షోభం కొత్తేమీ కాదు..

తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ లోకేష్ వెల్లడించారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా..? అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదు అని చరిత్రను గుర్తు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ను భర్తరఫ్ చేస్తే మన నేతలు పోరాడారన్నారు. అయితే‎ ఆ సంక్షోభం వేరు.. ఈ సంక్షోభం వేరు అని తేడాలను వివరించారు. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జగన్ అనుకున్నారు. భయం అనేదే టీడీపీ బయోడేటాలో లేదని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగనుకు భయపడతామా..? అంటే తీవ్రంగా విమర్శించారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని నియంత్రిస్తూ టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే సైకో జగన్ లక్ష్యం అంటూ విరుచుకుపడ్డారు.

భువనేశ్వరికి సీఐడీ బెదిరింపులు

2019కి ముందు నాపై కేసుల్లేవు.. ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి. రైతుల కోసం.. మహిళల కోసం.. నిరుద్యోగుల కోసం ప్రశ్నించడమే చంద్రబాబు చేసిన నేరమా..? అని ప్రశ్నించారు. ఇసుక దోపిడీ.. మద్యం మాఫియా గురించి మాట్లాడడమే చంద్రబాబు చేసిన తప్పా..? అంటూ స్పందించారు. ప్రజల కోసమే చంద్రబాబు అహర్నిశలు ఆలోచించారు. జగన్ సీఎం అయిన రోజు నుంచే విధ్వంసం జరుగుతోందన్నారు. నా తల్లిపై ఐటీ రిటర్న్స్ వంక చూపి.. కేసు పెడతానని బెదిరించారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏనాడైనా బయటకొచ్చారా..? అని ప్రశ్నిస్తూనే సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు నా తల్లికి తెలియదు అని తెలిపారు. గవర్నర్ ను కలవడానికి కూడా తన తల్లి వెళ్లలేదు అని ప్రజలకు వివరించారు. భూవనేశ్వరి.. బ్రహ్మాణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట. భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే అని ఘాటుగా స్పందించారు. స్కిల్ కేసులో ఆధారాలు దొరకక కార్యకర్తలిచ్చిన పార్టీ ఫండ్ ను.. అవినీతి సొమ్ము అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని వివరించారు.

టీడీపీ – జనసేన పొత్తుపై ప్రస్తావన..

జగన్ ఏం జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది. టీడీపీ-జనసేన మధ్య విబేధాలు వచ్చేలా పేటీఎం బ్యాచ్ కృషి చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ విషయంలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మేం నోరు విప్పితే తల ఎత్తుకోలేరంటూ హెచ్చరించారు. కానీ అలా మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తోంది.. వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు మాకు చెప్పారన్నారు. లక్షలు, కోట్ల రూపాయలతో బాత్రూంలు నిర్మించుకునే జగన్ పేదవాడంట అని ఎద్దేవా చేశారు. అలాగే రూ. 500 కోట్లతో విశాఖలో భవనం నిర్మించుకున్నట్లు తెలిపారు. లక్ష రూపాయల చెప్పులేసుకునే జగన్ పేదవాడా..? అని నిలదీశారు. నవంబర్ ఒకటి నుంచి బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను హింసిస్తున్నారన్నారు.

T.V.SRIKAR