సినీ నటి, మాజీ ఎంపీ సినీ నటి జయప్రద కనిపించడం లేదు. మిస్సింగ్ ఏంటి అనుకుంటున్నారు.. నిజంగా ఇదే నిజం. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాంపూర్‌లోని ప్రత్యేక ఎంపి, ఎమ్మెల్యే కోర్టులో జరుగుతున్న కేసులకు జయప్రద ఎప్పుడూ అటెండ్ కాకపోవడమే దీనికి కారణం. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో జయప్రద నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని చాలాసార్లు జడ్జి ఆదేశించినా.. ఆమె అటెండ్ కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు న్యాయమూర్తి. జనవరి 10లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.
దీంతో రామ్‌పూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది. రాంపూర్ నుంచి ముంబై వరకు మాజీ ఎంపీ ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. టీమ్ ఇప్పుడు ఆమె సన్నిహితులను కూడా సంప్రదించడం స్టార్ట్ చేసింది. ఆమె నర్సింగ్ కాలేజీలోనూ పోలీసులు సోదాలు చేశారు. ఐనా సరే జయప్రద జాడ ఎక్కడా దొరకలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు.. స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో జయప్రదనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయ్. జయప్రద 2019 ఎన్నికల్లో ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. జయప్రద ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, రాంపూర్ నుంచి రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్ధులలో జయప్రద పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.