భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకాబోతోంది. దాదాపు ఏడు వారాల విరామం తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉంది. సీనియర్ క్రికెటర్లందరూ ఈ సిరీస్ లో ఆడుతుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా బంగ్లాతో టెస్ట్ సిరీస్ ముంగిట సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. అశ్విన్ మరో 14 వికెట్లు సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. లయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు తీయగా…. పాట్ కమిన్స్ 42 టెస్టుల్లో 175 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఇక అశ్విన్ 35 మ్యాచుల్లో 174 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విన్ ఈ రికార్డును సునాయాసంగా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అశ్విన్ 26 వికెట్లు తీస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకుంటాడు. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ లో మాత్రమే చోటు దక్కించుకుంటున్న ఈ సీనియర్ స్పిన్నర్ ఇటీవల కాలంలో బ్యాట్ తోనూ అదరగొడుతున్నాడు. అశ్విన్ ఇప్పటి వరకూ 100 టెస్టుల్లో 516 వికెట్లు పడగొట్టాడు.