న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని ముంగిట నిలిచాడు. మరో 53 పరుగులు సాధిస్తే టెస్టుల్లో ఈ మైలురాయి అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి రికార్డులకెక్కుతాడు. భారత క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే 9 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. కాగా, కోహ్లి ఇప్పటి వరకూ 115 టెస్టుల్లో 48.89 సగటుతో 8947 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 18 పరుగులు సాధిస్తే వీరేంద్ర సెహ్వాగ్, పుజారాను అధిగమించి మూడో స్థానానికి చేరుతాడు.
కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ టాప్ ప్లేస్ లో ఉండగా.. సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ ప్రస్తుతం అంచ ఫామ్‌లో లేడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో అతను చేసింది ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే. చివరిగా 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మెరిసిన విరాట్ ఇటీవల బంగ్లాదేశ్ పై రెండు టెస్టుల సిరీస్‌లోనూ కోహ్లీ నిరాశపరిచాడు. కాగా
తొలి టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ విరాట్ కోహ్లీకి బాగా అలవాటైన పిచ్. సుదీర్ఘకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఐపీఎల్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ అక్కడే చాలా మ్యాచ్‌లు ఆడాడు.
ఇదిలా ఉంటే న్యూజిలాండ్ తో తొలి టెస్టులో కోహ్లీ ఈ రికార్డు అందుకోవడం అనుమానంగానే ఉంది. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారడమే దీనికి కారణం. భారీ వర్షం కారణంగా తొలిరోజు ఆట పూర్తిగా రద్దయింది. మిగిలిన రోజుల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉండడంతో తొలి టెస్ట్ పూర్తిగా జరిగే అవకాశాలు లేవనే చెప్పాలి. ఓవరాల్ గా కివీస్ తో సిరీస్ లో మాత్రం టీమిండియా రన్ మెషీన్ ఈ రికార్డులు అందుకోవడమే ఖాయమే. పైగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫుల్ ఫామ్ లోకి వస్తే ఇక కంగారూలకు కష్టాలు తప్పవు.