ఆ ఫ్రాంచైజీకే మాక్స్ వెల్, ఆల్ రౌండర్ పై పంజాబ్ కన్ను

గ్లెన్ మాక్స్ వెల్... ఈ పేరు చెప్పగానే విధ్వంసకర బ్యాటింగే గుర్తొస్తుంది. ఒంటిచేత్తో ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించగలడు... టీ ట్వంటీల్లో అయితే మాక్స్ వెల్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో అతని ఆటతీరు లేదు.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 06:41 PM IST

గ్లెన్ మాక్స్ వెల్… ఈ పేరు చెప్పగానే విధ్వంసకర బ్యాటింగే గుర్తొస్తుంది. ఒంటిచేత్తో ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించగలడు… టీ ట్వంటీల్లో అయితే మాక్స్ వెల్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో అతని ఆటతీరు లేదు. ఐపీఎల్ 2024 సీజన్ లో అయితే మాక్సీ అట్టర్ ఫ్లాపయ్యాడు. సీజన్ మొత్తం కేవలం 52 పరుగులే చేశాడు. బంతితో కూడా ఎటువంటి మ్యాజిక్ చూపించలేకపోయాడు. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని వేలంలోకి వదిలేసింది. కానీ మాక్స్ వెల్ ఫామ్ లో లేకున్నా ఫ్రాంచైజీల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఒక్కసారి అతను ఫామ్ లోకి వస్తే ఇక ఆపడం ఎవరి వల్లా కాదు. గతంలో పలు సీజన్లలో ఇది రుజువైంది కూడా… అందుకే మాక్స్ వెల్ కోసం పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను ఎలాగైనా తీసుకోవాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.

2 కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్న మ్యాక్స్ వెల్ పై పంజాబ్ కన్నేయడానికి ప్రధాన కారణం కొత్త కోచ్ రికీ పాంటింగే… మ్యాక్సీ సత్తా గురించి తెలిసిన పాంటింగ్ అతన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. తన దేశం వాడే కావడం, ఆల్ రౌండర్ గా జట్టుకు ఉపయోగపడతాడన్న నమ్మకం ఇతర కారణాలుగా చెప్పొచ్చు. పైగా మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ ఎక్కువ మనీ పర్స్ తో వేలంలోకి రానుంది. దీంతో కనీసం 10 కోట్లు పలుకుతాడన్న మాక్స్ వెల్ ను దక్కించుకోవడం పంజాబ్ కు పెద్ద కష్టం కాదు. అదే సమయంలో మిగిలిన ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ అంత లేకపోవడం కూడా పంజాబ్ కు కలిసొచ్చే అంశం. ఒకవేళ మిగిలిన ఫ్రాంచైజీలు మ్యాక్సీ కోసం ట్రై చేసినా ఏదో ఒక స్టేజ్ లో బిడ్ వదలుకోక తప్పదు. అందుకే పంజాబ్ కు మ్యాక్స్ వెల్ వెళ్ళిపోవడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు.

మరోవైపు గతంలో మాక్స్ వెల్ పంజాబ్ జట్టుకు ఆడాడు. 2014 సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ దే కీరోల్.. ఆ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన మాక్సీ 552 పరుగులు చేశాడు. ఇక ఆ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింతాతో కూడా మాక్స్ వెల్ కు సత్సంబంధాలున్నాయి. దీంతో పంజాబ్ కు ఆడే క్రమంలో మాక్స్ వెల్ కు మరింత ఫ్రీడమ్ ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మాక్స్ వెల్ ఐపీఎల్ కెరీర్ ను చూస్తే 134 మ్యాచ్ లు ఆడి 2771 పరుగులు చేయడంతో పాటు 37 వికెట్లు పడగొట్టాడు. 2021 వేలంలో మాక్సీని ఆర్సీబీ 14.25 కోట్లు వెచ్చించి దక్కించుకోగా.. ఈ సారి వేలంలో 10 కోట్లు లోపు ధర పలికే ఛాన్సుంది.