నా లక్ష్యం అదే ఆసీస్ టూర్ పై నితీష్ రెడ్డి

టీమిండియాకు ఆల్ రౌండర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది... సుదీర్ఘ కాలం అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటే ఆటగాళ్ళు మిగిలిన దేశాలతో పోలిస్తే మనకు తక్కువగానే దొరుకుతుంటారు. బ్యాట్ తో పాటు పేస్ బౌలింగ్ చేస్తూ ఆకట్టుకునే ఆల్ రౌండర్లు వస్తే ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ గానే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - October 29, 2024 / 08:00 PM IST

టీమిండియాకు ఆల్ రౌండర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది… సుదీర్ఘ కాలం అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటే ఆటగాళ్ళు మిగిలిన దేశాలతో పోలిస్తే మనకు తక్కువగానే దొరుకుతుంటారు. బ్యాట్ తో పాటు పేస్ బౌలింగ్ చేస్తూ ఆకట్టుకునే ఆల్ రౌండర్లు వస్తే ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ప్రస్తుతం టీమిండియాలో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడం ద్వారా జాతీయ జట్టులోకి ఎంపికైన నితీశ్ రెడ్డి ఇటీవలే బంగ్లాతో సిరీస్ లో సత్తా చాటాడు. అదే ప్రదర్శనతో ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికయ్యాడు. భారత్ ఏ జట్టుతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే సీనియర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని,.స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడనుండటం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. 2024 తనకెంతో కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మంచి అవకాశం దక్కిందని, దాన్ని సద్వినియోగం చేసుకున్నానని వ్యాఖ్యానించాడు. వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదగాలన్నదే తన జీవిత లక్ష్యమని నితీశ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలం గురించి ఆలోచించడం లేదని, ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడంపైనే ఫోకస్ పెట్టానన్నాడు.అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదగడానికి మరింత కష్టపడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ ఎ జట్టు ఆడే సిరీస్‌ తనకెంతో కీలకంగా ఉంటుందన్నాడు. ఆస్ట్రేలియాలో పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ఇది మంచి అవకాశంగా చెప్పుకొచ్చాడు.

బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగైతే ఆల్‌రౌండర్‌గా రాణించవచ్చనే ఆలోచనతో ఉన్నట్టు తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో రాణించాలంటే ఏకాగ్రత చాలా అవసరమని, కోచ్ గంభీర్ , కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచారని నితీష్ రెడ్డి చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్‌ ఈ ఆంధ్రా క్రికెటర్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పాలి. న్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 303 పరుగులు, 3 వికెట్లతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీశ్.. 74 పరుగులు, 2 వికెట్లతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత్-ఏ తరఫున బరిలోకి దిగుతున్నాడు.