మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ ను మతంలా, క్రికెటర్లను దేవుళ్ళులా చూస్తారు. ఇక ఈ రెండింటినీ నడిపించే బీసీసీఐకి ఆదాయం విషయంలో మరేదీ సాటి రాదు.. రాలేదు కూడా… ఐపీఎల్ తోనూ, అంతకంటే ముందు కూడా అన్ని క్రికెట్ దేశాలకంటే రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ మాత్రమే.. ఐపీఎల్ వచ్చిన తర్వాత బీసీసీఐ ఆస్తుల విలువ పెరుగుతూ పోవడమే తప్ప తగ్గింది లేదు. ప్రస్తుతం బీసీసీఐ నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే… ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం బీసీసీఐ నికర ఆస్తుల విలువ 2.25 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా 19 వేల కోట్లు… దీనిలో ఐపీఎల్ నుంచి 2,500 కోట్లు, ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల నుంచి సుమారు వెయ్యి కోట్లు వస్తాయి.
అటు గతేడాది టీవీ, ఇంటర్నెట్ హక్కులతో కలిపి చూస్తే ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఏటా 9 వేల 768 కోట్లు వస్తోంది. అలాగే బీసీసీఐకి స్పాన్సర్‌షిప్ హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది. 2023-2027 వరకు స్పోర్ట్స్ 18, జియో సినిమా బీసీసీఐకి అధికారిక బ్రాడ్ కాస్టర్ లుగా ఉన్నాయి. వీటి ద్వారానే భారీ స్థాయిలో ఆదాయాన్ని వెనకేస్తోంది. ఇక టికెటింగ్ హక్కులు, మర్చెండైజ్ సేల్ బీసీసీఐకి మరో ఆదాయ వనరుగా చెప్పొచ్చు. క్రికెటర్లు సంతకాలు చేసిన బాల్స్, బ్యాట్స్, టీమ్ షర్టులు, ఇతర వస్తువుల విక్రయం ద్వారా కూడా బీసీసీఐ భారీగా ఆర్జిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇతర దేశాల క్రికెట్ బోర్డుల ఆదాయం బీసీసీఐకి వచ్చేదానిలో సగం కంటే తక్కువే.