టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్సీ విషయంలో గత వారం రోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. అందరూ ఊహించినట్టు హార్థిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వకుండా అనూహ్యంగా సూర్యకుమార్ కు అప్పగించారు. రోహిత్ వారసుడిగా చాలా రోజుల నుంచి హార్థిక్ పేరు వినిపిస్తుండగా.. ఒక్కసారిగా అతనికి సెలక్టర్లు షాకిచ్చారు. 2026 టీట్వంటీ వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకునే సూర్య ఎంపిక జరిగిందని అంచనాకు వచ్చేశారు. అయితే హార్థిక్ ను ఎందుకు పక్కన పెట్టారన్న దానిపై చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. లంకతో టూర్ కు ముందు జరిగిన మీడియాతో సమావేశంలో కొత్త కోచ్ గంభీర్ తో కలిసి హాజరైన అగార్కర్ దీనిపై మాట్లాడాడు.
ఫిట్ నెస్ సమస్యల కారణంగానే హార్థిక్ కు కెప్టెన్సీ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండే ప్లేయర్ కే ఇవ్వాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు. హార్థిక్ జట్టుకు చాలా కీలక ఆటగాడని, అయితే ఫిట్ నెస్ ఇబ్బందులతో అతను అన్నిసార్లూ జట్టుకు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొందన్నాడు. ఈ కారణంగానే సూర్యకుమార్ ను సారథిగా ఎంపిక చేసినట్టు చెప్పాడు. తమకు ఉన్న ఆప్షన్స్ లో సూర్యనే అర్హుడిగా భావించి జట్టు కెప్టెన్సీ అప్పగించామన్నాడు.