పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఏపీలో 16జిల్లాల్లో, తెలంగాణలోని 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయ్. రాబోయే 3 రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని..భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు.
పలు జిల్లాల్లో నేటి నుంచి రేపటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను ముసురు కమ్మేసింది. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన జల్లులు.. కొనసాగుతూనే ఉన్నాయ్. నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షంతో.. భాగ్యనగరవాసులు ఇబ్బందలు పడుతున్నారు. భారీ వర్షాలతో గ్రేటర్ అధికారులు అలర్ట్ అయ్యారు. రాబోయే రెండు రోజులు భారీ వర్ష సూచన ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఇక అటు ఏపీవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతన్నాయ్. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయ్. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల 10 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా చింతూరులో 21 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో నంద్యాల జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయ్. ఏపీవ్యాప్తంగా ఓవరాల్‌గా చాలాచోట్ల 5సెంటిమీటర్ల కంటే అధికవర్షపాతం నమోదయింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. నదుల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల జనాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జిల్లా అధికారులకు సూచనలు జారీ చేస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితలంపై గాలులు వీస్తాయని తెలిపింది.