ఓ వ్యక్తిపై కాలనాగు పగబట్టింది. వరుస కాట్లలో బెంబేలుత్తిస్తోంది. ఎక్కడికి వెళ్లినా వెంటాడి మరీ కాటేస్తోంది. 40 రోజుల వ్యధిలో ఒకే పాము అదే వ్యక్తిని 7 సార్లు కాటేసింది. ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారేమో. కాదు.. నిజంగా జరిగిన కథ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడి మీద ఓ పాము పగబట్టింది. 40 రోజుల్లో వికాస్ దూబేను ఏడు సార్లు పాము కాటు వేసింది. దీంతో వికాస్ దూబే తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వికాస్ దూబే పరిస్థితి బాగానే ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.
జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం మీద పడుకుని.. కిందికి దిగుతుండగా వికాస్ దూబేను తొలిసారి పాము కాటు వేసింది. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 2 రోజులు చికిత్స పొందిన తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక మరో రెండు సార్లు పాము కాటు వేసింది. మళ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు.
కొన్ని రోజులకు మరోసారి పాము కాటు వేయడంతో ఇల్లు మార్చమని డాక్టర్ వికాస్‌కు చెప్పాడు. దీంతో రాధానగర్‌లోని తన అత్త ఇంటికి వెళ్లిపోయాడు వికాస్. కానీ అదే పాము అక్కడికి వచ్చి ఐదోసారి వికాస్‌ను కాటు వేసింది.
దీంతో అతని తల్లిదండ్రులు వికాస్‌ను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. కానీ ఆ పాము మాత్రం వికాస్‌ను వదల్లేదు. మళ్లీ అతని ఇంటికి వెళ్లి జూలై 6న ఒకసారి.. రీసెంట్‌గా మరోసారి కాటు వేసింది. పదే పదే వికాస్ దూబేను పాము కాటు వేస్తుండటం పట్ల అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడుతున్నారు. కానీ ఇదంతా పాము తనపై పగబట్టి చేస్తోందని వికాస్ చెప్తున్నాడు. తాను మొత్తం 9 సార్లు పాము కాటుకు గురి అవుతానని.. ఇందులో 8 సార్లు తనకు ఏం కాదని.. కానీ 9వ సారి మాత్రం ఏ డాక్టర్లు గానీ తాంత్రికులు గానీ తనను కాపాడలేరంటూ చెప్తున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా పాము తనకు కలలో కనిపించి చెప్పిందని చెప్తున్నాడు. ఇక పాము తనను శని, ఆదివారాల్లో మాత్రమే కాటు వేస్తుందని.. పాము వచ్చే కొన్ని నిమిషాల ముందు తనకు ఏదో భయం కలిగినట్టు సంకేతాలు తెలుస్తాయని చెప్తున్నాడు. ఇదంతా కోఇన్సిడెంటల్‌గా జరుగుతోందని కొందరు చెప్తుంటే.. కాదు పాము నిజంగానే పగబట్టిందని కొందరంటున్నారు. మ్యాటర్ ఏదైనా ఈ వరుస పాము కాట్లతో వికాస్ దుబే ఇప్పుడు ఫతేపూర్‌లో హాట్ టాపిక్ అయ్యాడు.