Telangana BJP: నవంబర్ 1 తరువాతే రెండో జాబితా.. బీజేపీతో జనసేన పొత్తుపై నేడు స్పష్టత

బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితా ఇప్పటికే విడుదల చేసింది. మలిజాబితాను నవంబర్ 1 తరువాతే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో జనసేన పొత్తు అంశంపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నాయకులు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 08:37 AM IST

బీజేపీ ఈ సారి తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే మలిజాబితాపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కీలక స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థుల విషయంపై స్పష్టత రాకపోవడంతో కాస్త ఆలస్యం అయినా గెలుపు గుర్రాలను, గట్టి పోటీ ఇచ్చే వారినే బరిలో దింపేందుకు పావులు కదుపుతోంది. ఇక నవంబర్ 1న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. అదే రోజు లేదా నవంబర్ 2వ తేదీన రెండవ జాబితాను ప్రకటించే చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలకు గానూ 52 స్థానాల అభ్యర్థులకు టికెట్ కన్ఫాం చేసింది బీజేపీ. మిగిలిన 67 స్థానాలకు గానూ మరో 30 నుంచి 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే మాజీ ఎంపీల్లో కొందరు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖత చూపించేందుకు సిద్దంగా లేరు. వీరు మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట. అందులో ముఖ్యంగా డీ.కే. అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి. వివేక్ ల పేర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో గద్వా, మహబూబ్ నగర్, తాండూరు, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రదాన జిల్లాల్లో ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మరి కొన్ని స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నడిబొడ్డున జీహెచ్ఎంసీ పరిధిలో కూడా కీలక స్థానాలపై అభ్యర్థుల ఎంపిక విషయంలో మీన మేషాలు లెక్కిస్తోంది బీజేపీ. ముఖ్యంగా ముషీరాబాద్, అంబర్ పేట, సికింద్రాబాద్ స్థానాలు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఎవరిని బరిలో దింపుతారో ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. కాంగ్రెస్ రెండవ జాబితా విడుదల చేస్తే అందులో టికెట్ ఆశించి భంగపడ్డవారు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. వారిలో మంచి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ పొత్తు అంశంపై ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నేడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇందులో కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. జనసేన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీ అభిప్రాయపడుతోంది. దీనిపై ఇప్పటికే రెండు రోజుల సమయం కోరిన పవన్ నేడు ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి జనసేన అభ్యర్థులతో పాటూ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.

T.V.SRIKAR