సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గానీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగదు. నామినేషన్లు సమర్పించడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందనగా బీజేపీ సీఈసీ భేటీ జరుగుతుంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగుతారో కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ముందుకెళ్తోంది బీజేపీ నాయకత్వం. బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్‌కు మూడు నెలల ముందే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ ఏడాది చివరల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులపై కూడా చర్చించబోతోంది బీజేపీ సీఈసీ
ఐదు రాష్ట్రాలపై రేపే కీలక భేటీ
ఢిల్లీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మొత్తం 15 మంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ , మిజోరాం రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశం కీలకంగా చర్చిస్తుంది. రాష్ట్రాల ఎన్నికల ఇన్‌ఛార్జులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా పాల్గొంటారు.
ఎక్కడ వీక్‌గా ఉన్నాం.. ఏం చేద్దాం ?
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఈ ఐదు రాష్ట్రాలకు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఒక్క మధ్యప్రదేశ్ మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఈ రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా పాతాలన్నది బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే స్ట్రాటజీని రెడీ చేస్తున్నారు నేతలు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఏఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది.. ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది అన్న అంశాలపై క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకున్న నివేదికలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. స్థానిక ఉన్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయా లేవా అన్న విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులను అడిగి తెలుసుకుంది. తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చర్చిస్తారు. అధ్యక్షుడి మార్పు తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ తగ్గిందన్న విమర్శలున్నాయి. ఈటల వర్సెస్ బండి వర్సెస్ కిషన్ రెడ్డి ఇంటర్నల్ పాలిటిక్స్‌తో రాష్ట్ర స్థాయిలో కొంత డ్యామేజ్ జరిగిందని.. పార్టీ సీనియర్లే ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో గెలుపు అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఎవరెవర్ని బరిలోకి దించాలి వంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. రాజస్థాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు అంతర్గత సమస్యలతో సతమతమయినా.. కొంతకాలంగా ప్రజారంజక పథకాలను ప్రకటిస్తూ ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడుతోంది. రాజస్థాన్‌లో మరోసారి వసుంధరరాజేను రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.
అభ్యర్థులను డిసైడ్ చేస్తారు..కానీ ప్రకటించరు
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని చాలా నియోజవర్గాల్లో అభ్యర్థుల జాబితాను కూడా రేపే ఖరారు చేసే అవకాశముంది. బలమైన అభ్యర్థులు ఉండి కచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాలను రేపే ఫిక్స్ చేస్తారు. అయితే అధికారికంగా అభ్యర్థుల జాబితా మాత్రం ప్రకటించరు. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలను రచించేలా అభ్యర్థులకు మాత్రం ముందుగానే చెప్పే అవకాశముంది.
2024 టార్గెట్‌గా ఎన్నికల వ్యూహాలు
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి పదోసారి ప్రసంగించి రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి మోడీ… పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోసారి అవకాశమిస్తే 2024లోనూ ఇక్కడి నుంచే ప్రసంగిస్తానంటూ ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా పెత్త ఎత్తున విమర్శలు వినిపిస్తున్నా…వ్యక్తిగతంగా మోడీ ఇమేజ్ మాత్రం ఆయన ఓటుబ్యాంక్‌లో అలాగే ఉంది. విపక్షం బలంగా లేకపోవడం కూడా దీనికి ఓ కారణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచే పార్లమెంట్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇండియా పేరుతో విపక్షం కూటమిగా ఏర్పడినా…తమ వెంట దేశ ప్రజలు ఉన్నారని బీజేపీ నమ్ముతోంది. అందుకే ఐదు రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం మాదేనంటోంది.