బ్రాండ్ వాల్యూలో తగ్గేదేలే, ఏ టీమ్ టాప్ లో ఉందంటే ?

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పటికప్పుడు క్రేజ్ పెంచుకుటూనే పోతోంది.. బ్రాండ్ వాల్యూలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది... ఫాలోయింగ్ లో మరే క్రికెట్ కంట్రీ కూడా దరిదాపుల్లో లేదు..తాజాగా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అక్షరాలా లక్ష కోట్లు దాటిపోయింది.

  • Written By:
  • Publish Date - December 7, 2024 / 01:58 PM IST

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పటికప్పుడు క్రేజ్ పెంచుకుటూనే పోతోంది.. బ్రాండ్ వాల్యూలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది… ఫాలోయింగ్ లో మరే క్రికెట్ కంట్రీ కూడా దరిదాపుల్లో లేదు..తాజాగా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అక్షరాలా లక్ష కోట్లు దాటిపోయింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే భారత్ కరెన్సీలో రూ.1.01 లక్షల కోట్లు… 2009లో దీని బ్రాండ్ విలువ 2 బిలియన్ డాలర్లకి చేరువలో ఉండగా.. ఇప్పుడు 12 బిలియన్ డాలర్లకి చేరింది. పాకిస్థాన్ మినహా.. ఐసీసీ సభ్యత్వం ఉన్న అన్ని క్రికెట్ దేశాల్లోని ఆటగాళ్లు ఐపీఎల్‌‌లో ఆడుతున్నారు. గత ఏడాది బ్రాడ్ కాస్టింగ్ డీల్ తో పాటు డిజిటల్ హక్కుల అమ్మకంలోనూ ఐపీఎల్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అక్షరాలా 44,075 కోట్ల రూపాయలకు ప్రసార హక్కులు అమ్ముడయ్యాయి. వీటిలో టీవీ ప్రసార హక్కులను సోనీ సంస్థ 23, 575 కోట్లకు దక్కించుకోగా..డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్18 సంస్థ 20,500 కోట్లకు దక్కించుకుంది. ఈ డీల్ తర్వాత ఐపీఎల్ వాల్యూ బాగా పెరిగింది.

ఫ్రాంఛైజీలు ప్రకారం చూసుకుంటే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 100 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూ‌తో టాప్ 4లో కొనసాగుతున్నాయి. అన్ని జట్ల కంటే సీఎస్‌కే టాప్‌లో నిలిచింది. ఆ జట్టు వాల్యూ 52 శాతం పెరిగి 122 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారుగా 1,033 కోట్లకు చేరుకుంది. ఇక లీగ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ టీమ్ బ్రాండ్ విలువ 36 శాతం పెరిగి 1,007 కోట్లుగా ఉంది. అయితే ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవనప్పటికీ తిరుగులేని క్రేజ్ ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 67 శాతం పెరిగి 117 మిలియన్ల 990 కోట్లుకు చేరింది. గత సీజన్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్ బ్రాండ్ విలువ 38 శాతం పెరిగి దాదాపుగా 922 కోట్లకు చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వాల్యూ ఏకంగా 76 శాతం పెరిగి సుమారుగా 719 కోట్లుగా ఉంది.

గత ఏడాదితో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 81 మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ విలువ 24 శాతం పెరిగి 80 మిలియన్ డాలర్లకు చేరింది. కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ బ్రాండ్ విలువ వరుసగా 69 మిలియన్ డాలర్లు, 60 మిలియన్ డాలర్లుగా ఉంది. పాత ఫ్రాంఛైజీ అయినప్పటికీ.. ఇటీవల పుంజుకున్న పంజాబ్ కింగ్స్ 49 శాతం పెరిగి 68 మిలియన్ డాలర్లతో కొనసాగుతోంది.