Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు.. కాంగ్రెస్‌ పార్టీ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుందా ?

ఒకే ఒక్క మాటతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైందే నీళ్లు, నిధులు, నియామకాలమీద. వ్యవసాయాధారిత రాష్ట్రం కావడం వల్ల రైతుల గురించి విద్యుత్‌, నీటి వినియోగం గురించి మట్లాడే ప్రతీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఏకంగా కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడే ఈ విషయంలో నోరు జారారు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 01:36 PM IST

తెలంగాణలో రైతులకు 24 గంటలు విద్యుత్‌ అవసరం లేదంటూ కామెంట్‌ చేశారు. ఈ ఒక్క కామెంట్‌తో కాంగ్రెస్‌ మీద బీఆర్‌ఎస్‌ పార్టీ విరుచుకుపడుతోంది. సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌ లీడర్ల చేతికి ఆయుధం ఇచ్చినట్టైంది. రైతులకు కరెంట్‌ సరఫరా, నీటి సరఫరా చాలా సున్నితమైన అంశం. ఈ విషయంలో ప్రభుత్వాలే తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా రైతులకు 24 గంటలు కరెంట్‌ ఎందుకు అని మాట్లాడారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. రైతులు పొలానికి నీళ్లు పెట్టుకునేందకు 3 గంటల కరెంట్‌ చాలని, ఆ 3 గంటల కరెంట్‌ వాళ్లకు ఇస్తే సరిపోతుదంటూ చెప్పారు. మిగిలిన కరెంట్‌ను వేరే అవసరాలు వినియోగించుకోవచ్చిన చెప్పారు. ఆయన ఉద్దేశం ఏదైనా ఇదే కామెంట్‌ను ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్‌ను ఏకిపారేస్తున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్లు.

కాంగ్రెస్‌ వస్తే మళ్లీ రైతుల జీవితాల్లో కష్టాలు మొదలౌతాయి, కరెంట్‌ కోత మొదలౌతుంది అనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో కౌంటర్‌ ఇచ్చారు. కరెంట్‌ కోత విధించే కాంగ్రెస్‌ కావాలా, మతం పేరిటి మంట పెట్టే బీజేపీ కావాలా రైతులకు 24 గంటలకు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ కావాలా అంటూ ట్వీట్‌ చేశారు. గతంలో తెలంగాణకు చంద్రబాబు చేసిన ద్రోహమే ఇప్పడు రేవంత్‌ రెడ్డి కూడా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

తెలంగాణ రైతులకు వెంటనే రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. అసలే ఇది ఎలక్షన్‌ టైం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న కాంగ్రెస్‌ పార్టీని ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో డిఫెన్స్‌లో పడేశారు టీపీసీసీ ప్రెసిండెంట్‌ రేవంత్‌ రెడ్డి.