తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో షెడ్డుకెళ్ళిన కారు… ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయింది. ఇక తుక్కు కింద అమ్మేసుకోవడమే. తెలంగాణలో 10యేళ్ళ పాలించిన brs అడ్రెస్… ఈ లోక్ సభ ఎన్నికల్లో గల్లంతయింది. 2001 లో trs స్థాపించినప్పటి నుంచి ఇప్పటి దాకా లోక్ సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉండేది. కానీ మొదటిసారిగా BRSకు లోక్ సభలో కాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఆరు నెలల్లో brs పరిస్థితి మొత్తం తలకిందులైంది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక… అప్పటి లోక్ సభ ఎన్నికల్లో 11 ఎంపీ సీట్లను brs గెలుచుకుంది. ఆ తర్వాత 2019లో 9 ఎంపీ స్థానాలు దక్కగా… ఈసారి ఒక్క సీటు కూడా brs కు రాలేదు. 17 ఎంపీ స్థానాల్లో ఒక్క మెదక్ మినహా మిగతా ఎక్కడా కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది గులాబీ పార్టీ. లోక్ సభ ఎన్నికల తర్వాత BRS భూస్థాపితం అయిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజమయ్యాయి.
TRS ను బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ బాస్ KCR… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ఢిల్లీలో మనమే ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది అంటూ ప్రగల్భాలు పలికారు. సెంట్రల్ లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోతే… మన కాళ్ళే పట్టుకుంటారని జనం చెవుల్లో పువ్వులు పెట్టారు. అంతే కాదు… ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చని కలలు కన్న కేసీఆర్ ని తెలంగాణ జనం ఈడ్చి కొట్టారు. పీఎం కుర్చీపై కన్నేసిన కేసీఆర్ ను కనీసం లోక్ సభలో అడుగుపెట్టకుండా బీజేపీ, కాంగ్రెస్ కలసి చావు దెబ్బ తీశాయి.
ఈ పరిస్థితుల్లో మళ్లీ brs పేరుతో పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ రాజకీయం మొదలుపెడతారా ? లేదంటే ఇంట్లోనే కూర్చుంటారా అన్నది చూడాలి. ఎందుకంటే ఈమధ్యే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అక్కడి నుంచి కొందరు నేతలు కూడా వచ్చి kcr ని కలసి వెళ్లారని చెబుతున్నారు. తెలంగాణలో ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ ను మహారాష్ట్ర జనం ఎంతవరకూ ఆదరిస్తారన్నది అనుమానమే.
ఇప్పుడు BRS నుంచి వలసలు స్టార్ట్ అయ్యే ఛాన్సుందన్న వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల దాకా వెయిట్ చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు… ఇక ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరతారన్న టాక్ నడుస్తోంది. 39 మంది BRS ఎమ్మెల్యేల్లో ఆ పార్టీలో ఉండేదెవరు… మిగతా పార్టీల్లో జంప్ అయ్యేదెవరు అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి పదేళ్ళ అహంకారాన్ని తెలంగాణ జనం ఈ విధంగా దెబ్బతీశారు.