బంగారం ఎవరు కొనుగోలు చేయాలనుకోరు చెప్పండి. తన జీవితంలో ఒక గ్రాము అయినా కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి బంగారం విషయంలో స్వచ్ఛత గురించి ఎక్కడా రాజీ పడకూడదు. చిన్నపాటి బంగారు ఆభరణాల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ హాల్ మార్క్ చూసి కొనాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధ్రువీకరిస్తూ బీఐఎస్ నగలనే కొనుగోలు చేయాలి అని ఆదేశించింది. దీనికోసం బీఐఎస్ కేర్ అనే యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా తమంతట తామే ఎక్కడ నుంచి అయినా బంగారు స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు.
ప్రతి ఒక్క బంగారు నగలపై కేంద్ర ప్రభుత్వం ఒక కోడ్ ను తప్పని సరి చేసింది. దీనిని అల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్ ను రూపొందించింది. ఇది ఆరు అంకెల్లో ఉంటుంది. బంగారు ఆభరణాలు తయారు చేసేటప్పుడు ఈ నంబర్‌ను కేటాయిస్తారు. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన కోడ్‌ను కేటాయిస్తారు. బీఐఎస్ కేర్ యాప్‌లో నగపై ఉన్న కోడ్ ను నమోదు చేయడంవల్ల మన నగ ఎంత స్వచ్చమైనదో తెలిసిపోతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బంగారు, వెండి రెండింటికీ ఈ హాల్ మార్కింగ్ పద్దతిని కేటాయించింది.
స్మార్ట్ ఫోన్లో బీఐఎస్ యాప్ ఆపరేటింగ్..
మన స్మార్ట్ ఫోన్లో బీఐఎస్ కేర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
మీ పేరు, ఫోన్ నంబర్ తో పాటూ మెయిల్ ఐడీ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
వెంటనే మీకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది దానిని నమోదు చేయాలి.
బీఐఎస్ యాప్ ఓపెన్ చేయగానే వెరిఫై హెచ్‌యూఐడీ అని కనిపిస్తుంది
ఆ ఆప్షన్ ను క్లిక్ చేసి మన బంగారు/వెండి నగలపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్ నమోదు చేయాలి
మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన షాపు, హాల్ మార్క్ వేసిన ముద్ర, ఏ రకమైన ఆభరణం, దాని స్వచ్ఛత వంటి వివరాలతోపాటూ బిల్లుతో పాటూ అన్నీ కనిపిస్తాయి.
T.V.SRIKAR