Election Code: తెలంగాణలో ఎలక్షన్ కోడ్.. రూ.50 వేల కంటే ఎక్కవ డబ్బులు తీసుకెళ్తే ఏమౌతుంది..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 08:14 AM IST

తెలంగాణలో యాభై వేల రూపాయల కంటే ఎక్కువ క్యాష్‌ తీసుకెళుతున్నారా? వ్యాపారమో.. భూమి రిజిస్ట్రేషన్ కోసమో లక్షల రూపాయలు వెంట బెట్టుకుని వెళుతున్నారా? అయితే, మీరు చిక్కుల్లో పడ్డట్టే. వాటికి సంబంధించిన ఆధారాలు చూపకపోతే మీ డబ్బు మీది కాదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పెద్ద మొత్తంలో క్యాష్‌ తీసుకెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ తప్పసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వస్తే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసలు ఎన్నికల కోడ్‌ రూల్స్‌ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో 148 చెక్‌పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. స్థానిక ప్రజలు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు డబ్బులు తీసుకెళుతున్న టైంలో తగిన ఆధారాలు, పత్రాలు వెంటే ఉంచుకోవాలని వెల్లడించింది. ఏమాత్రం లెక్కాపత్రంలేని డబ్బులను సీజ్ అవుతాయని తెలిపింది. అందుకే పెద్ద మొత్తంలో క్యాష్‌ క్యారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు అధికారులు. రూల్స్ ప్రకారం 50వేల రూపాయల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉందన్న అధికారులు.. అంతకుమించి తీసుకెళితే మాత్రం తగిన ఆధారాలు చూపాలి.

ఆ డబ్బుకు సంబంధించిన రసీదులు, పత్రాలు వెంటబెట్టుకోవాలి. బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేస్తే, పాస్ బుక్ వెంటబెట్టుకోవాలి. లేదంటే కనీసం ఏటీఎం విత్ డ్రా చీటినైనా దగ్గర వుంచుకోవాలి. భూముల క్రయవిక్రయాల్లో భాగంగా అమౌంట్ ను తీసుకెళితే.. దానికి సంబంధించిన దస్తావేజులను అధికారులకు చూపాల్సి వుంటుంది. ఇక హాస్పిటల్స్ చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితే వస్తే..పేషంట్ రిపోర్టులు, ఆస్పత్రి రశీదులు, ఇతర పత్రాలు తమ దగ్గర వుంచుకోవాలంటున్నారు అధికారులు. వ్యాపారం చేసేవాళ్లు నిత్యం లక్షల్లో నగదు క్యారీ చేస్తుంటారు. లావాదేవీల రసీదులను చూపిస్తే ఎలాంటి సమస్యా వుండదు. ఒకవేళ లెక్కాపత్రం లేకుండా వ్యాపారులు యాభై వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళుతుంటే జీఎస్టీతో పాటు ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు. తగిన ఆధారాలు చూపిస్తే ఎలాంటి కేసూ వుండదు. డబ్బులను తిరిగిచ్చేస్తారు. లేదంటే డబ్బుల స్వాధీనంతో పాటు కేసులూ ఎదుర్కోక తప్పదు.

ఇక రైతులు సైతం ధాన్యం లేదా ఇతర పంటలను అమ్ముతుంటారు. పంటను అమ్మగా వచ్చే డబ్బును తీసుకెళుతున్నప్పుడు తప్పకుండా బిల్లులను తమ దగ్గరే వుంచుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. కాలేజీ ఫీజులు, బిజినెస్, ఫంక్షన్స్, లేదా ఇతర అసవరాలు ఏవైనా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లేవారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యా వుండదంటున్నారు అధికారులు. నగదు మాత్రమే కాకుండా బంగారం, ఇతర ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లినా ఇబ్బందేనని హెచ్చరిస్తున్నారు. నగదైనా, బంగారమైనా తగిన ధ్రువపత్రాలు చూపితే, ఎలాంటి సమస్య ఉండదు.