AP Transport: ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు లేకుండానే ప్రయాణం చేసేలా ఏపీలో కొత్త మార్గదర్శకాలు

సాధారణంగా మనం ఎక్కడికైనా వాహనం మీద ప్రయాణం చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. లేకపోతే మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానా విధిస్తారు. ఒక్కోసారి ఫోనులో సాఫ్ట్ కాపీ చూపిస్తే కూడా వదిలేస్తారు. అయితే ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి రాలేదు. ఉత్తర భారత దేశంలో చాలా చోట్ల ఇప్పటికే సాఫ్ట్ కాపీ చూపించి తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇలాంటి మార్గ దర్శకాలను జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 07:33 AM IST

మోటారు వాహనాలు డ్రైవింగ్ చేసే వారు ఇకపై కార్డు రూపంలో ఉండే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ లను భౌతికంగా చూపించనక్కర్లేదు. రవాణా శాఖ ఏర్పాటు చేసిన యాప్ లో డౌన్లోడ్ చేసి చూపిస్తే సరిపోతుందని ఏపీ రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మామూలుగా ఇలాంటి కార్డులు పొందాలంటే రూ. 200 తో పాటూ పోస్టల్ ఛార్జీలు అదనంగా రూ. 25 కలిపి రూ.225 రవాణా శాఖకి చలానా రూపంలో చెల్లించేవారు. ఇప్పుడు ఇలా చెల్లించనవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించింది. రవాణా శాఖ కు సంబంధించి కేంద్రప్రభుత్వం వాహన్ పరివార్ అనే యాప్ తో సేవలన్నింటినీ ఆన్లైన్ చేసింది. ఇది అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న తరుణంలో తాజాగా మన ఏపీ ప్రభుత్వం కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో ఆర్టీఓ లేదా పోలీసులు తనిఖీలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలా డౌన్లోడ్ చేసిన పత్రాలను చూపిస్తే సంబంధిత అధికారులు అనుమతించేలా ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మార్గదర్శకాలను జారీచేశారు. దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్డు డౌన్లోడ్ కోసం ఇలా చేయాలి

రవా‎ణా శాఖకు సంబంధించిన http://https//aprtacitizen.epragathi.org వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
ఫారం 6 లేదా 23ని డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధృవపత్రాన్ని తీసుకోవాలి.
స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోదలచినవారు మరో ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా దీనిని పొందవచ్చు.
aprtacitizen ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

T.V.SRIKAR