తెలంగాణలో మూడో శాసనసభ సమావేశాలు మొదలైన్నాయి. నాలుగు రోజలు విరామం తర్వాత నేడు 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అయ్యి.. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతిపట్ల శాసనసభ సంతాపన్ని తెలియజేసింది. ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీల శ్వేత పత్రం విడుదల..
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేత పత్రంలో పలు కీలక విషయాలను ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71, 757 కోట్లు అని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం అప్పులు రూ.72,658 కోట్లు ఉండగా.. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం రుణం రూ.3, 89లక్షల కోట్లు అని తెలిపింది.
ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59వేల 414 కోట్లు అని తెలిపింది. కాగా అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణ భారం పెరిగిందని తెలిపింది. రెవెన్యూ రాబడిలో 34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రాబడిలో 35 శాతం ఉద్యోగుల జీతాలకు వ్యయం అవుతున్నట్లు స్పష్టం చేసింది. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని పేర్కొంది.
2023-24 నాటికి రుణ, జీఎస్టీపీ 27.8 శాతానికి పెరిగిందని తెలిపింది. బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉన్నట్లు సర్కారు క్లారిటీ ఇచ్చింది. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించింది. ప్రతి రోజూ వేస్ అండ్ మీన్స్ పై ప్రభుత్వం ఆధారపడాల్సిన దుస్థితి ఉందని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది.
శాసనసభలో శ్వేత పత్రాన్ని విడుదల చేసి ఆర్థిక రంగానికి అన్ని అంశాలను వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 1953 నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చు, తీసుకున్న అప్పులు, తదితరాలను కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను కూడా వివరించే అవకాశం ఉంది.