Costly Water Bottle: ప్రపంచంలోనే ఖరీదైన మంచి నీళ్ల బాటిల్.. దీని ధర అక్షరాలా రూ. 45 లక్షలు.!

మనం ఎక్కడికైనా బయటకు లేదా రెస్టారెంట్లకు వెళితే నీటి బాటిల్స్ కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇంట్లో నుంచి బాటిల్ క్యారీ చేసుకుని పోవాలంటే కాస్త అసౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఇలా చేస్తే ఉంటాం. దీని ధర అందులో ఉన్న మినరల్ కంటెంట్ బట్టి.. తయారు చేసిన కంపెనీపై ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. మరింత కాస్ట్లీ వాటర్ అంటే సాఫ్ట్ వాటర్ పేరుతో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1000 నుంచి రూ.1500 వరకూ ఉంటుంది. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇంతకీ మినరల్ వాటర్ గురించి ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా.. ఒక అసాధారణమైన అంశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 02:30 PM IST

మన చుట్టూ ప్రపంచంలో పంచభూతాలు గాలి, నీరు, నేల,నిప్పు, ఆకాశం అన్నీ ఒక పరిమితి వరకూ ఉచితంగా అనుభవించచ్చు. మన సొంతానికి కావాలంటే కొనాల్సి వస్తుంది. దీనికి కొన్ని షరతులు ఉంటాయి. ఈ కోవలోకి వస్తోంది మనం ఇప్పుడు తెలుసుకోబోయే నీరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్లుగా గుర్తించబడింది. దీని ఖరీదు అక్షరాలా రూ. 45 లక్షలు ఉంటుందట. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసు మొత్తం కష్టపడి సంపాదించుకున్న గ్రాడ్యూటీ సోమ్ము విలువకు సమానం. అలాగే చిన్నపాటి సిటీలో డబుల్ బెడ్ రూం ఇల్లును నిర్మించుకునే విలువకు సరితూగుతోంది ఈ వాటర్ బాటిల్. ఇప్పటి వరకూ కాస్ట్లీ టీ చూశాం. ఇప్పుడు కాస్ట్లీ వాటర్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఇంతకు ఈ వాటర్ ప్రత్యేకత ఏంటి అని అందరిలో ఆసక్తికలుగవచ్చు.

ఎలా సేకరిస్తారు..!

ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజంగా వచ్చే నీటి బుగ్గల నుంచి సేకరిస్తారు. అత్యంత స్వచ్ఛమైన భూగర్భ జలాలు పైకి ఉబికి నేలపై ప్రవహిస్తూ ఉంటాయి. అలా సహజంగా ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇందులో చెప్పుకోదగ్గ పెద్ద వింతేమీ లేదు. అన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇలా సహజమైన, స్వచ్ఛమైన నీటిని సేకరించే బాటిల్స్ లో నింపి అమ్ముతూ ఉంటాయి అని అనుకోవచ్చు. అయితే అన్ని బాటిల్స్ లాగా దీనిని పరిగణించకూడదు ఎందుకంటే ఈ బాటిల్ డిజైన్ మొదలు అందులోని నీటి రుచి వరకూ అన్నీ ప్రత్యేకతలే ఉన్నాయి. ఇందులో నీటి పరిమాణం కూడా 750 ఎంఎల్ ఉంటుంది. అంటే లీటర్ కూడా ఉండదన్న మాట.

ప్రత్యేకత ఏంటి..?

ఈ బాటిల్ లోపలి భాగాన్ని స్వచ్ఛమైన మేలిమి బంగారంతో తయారు చేశారు. అలాగే ఈ బాటిన్ రూపాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రూపొందించారు. ఇతను ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వైన్ బాటిల్ హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నస్ కోగ్ న్యాక్ ను డిజైన్ చేసింది ఇతగాడే. అందుకే ఈ బాటిల్ నీళ్లు అత్యంత రుచికరంగా ఉంటూ ప్రస్తతం మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే నీళ్ల కంటే అధిక శక్తిని కలిగి ఉండటమే దీని మరో ప్రత్యేకతగా చెబుతారు. వీటిని సామాన్యులు కొనుగోలు చేయలేరు. ప్రపంచంలో పేరొందిన, సుసంపన్న, వ్యాపార దిగ్గజులు వీటిని అప్పుడప్పుడూ కొనుగొలు చేసి రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు.

T.V.SRIKAR