గర్భవతే కాదు.. గర్భవతుడు కూడా ఉంటాడనే చర్చ మొదలైంది. ఇదేదో అల్లాటప్పాగా పుట్టించిన ప్రచారం కాదు.. డాక్టర్లు బయటపెట్టిన నిజం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది ఈ ఘటన. కాకపోతే ఇప్పుడు కాదు పాతికేళ్ల కిందట. వైద్యశాస్త్రంలోనే ఇది అరుదైన ఘటన. ది డైలీ స్టార్ అనే పత్రిక.. దీని మీద కథనాలు ప్రచురించింది. అది 1999వ సంవత్సరం.. భారీ పొట్టతో సంజు భగత్ అనే యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ బానెడు పొట్టను భరించాడు అతను ! పొట్ట చూసి స్నేహితులు ఆట పట్టించినా.. సమాజంలో అదోలా చూసినా ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. ఐతే రాను రాను పొట్ట పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో.. 1999లో ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు.
సంజును చూడగానే కడుపులో గడ్డ పెరిగినట్లు డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ మొదలుపెట్టిన కాసేపటికి భారీ క్యాన్సర్ కావొచ్చు అని అంచనాకు వచ్చారు. ఐతే పొట్టలో ఉన్నది చూశాక డాక్టర్‌కు నోట మాట రాలేదట. మనిషి అవయవాలు ఒకటొకటిగా బయటకు రావడం మొదలుపెట్టాయ్. ఇది కలా.. నిజమా అని తెలసుకునేందుకు డాక్టర్లు చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కావు అంటూ.. ది డైలీ స్టార్ పత్రికలో కథనాలు రాసుకువచ్చారు. 36ఏళ్లుగా తన కవల సోదరుడి పిండం సంజు భగత్‌లో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
దీన్నే వైద్య పరిభాషలో ఫీటస్ ఇన్ ఫీటు.. అంటే పిండంలో పిండం అంటారని వివరించారు. ఇది చాలా అరుదైన కేసు అని.. ఒక వైకల్య పిండం తన కవల సోదరుడి దేహంలో ఉండిపోయిందని చెప్పారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్ ప్రకారం ఇటువంటి కేసులు వందకు లోపే ఉంటాయని.. చెప్పారు. ఐతే ఆ సంజు భగత్‌కు ఇప్పుడు వృద్థాప్యంలోకి వచ్చేయగా.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు.