Oil Prices: ముడి చమురుపై పడిన ఇజ్రాయెల్ – హమాస్ యుద్ద ప్రభావం.. మన దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పరిస్థితి ఏంటి..?

ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ద ప్రభావంతో రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు పెరుగనున్నాయి. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది. మన దేశంలో పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 12:24 PM IST

ప్రస్తుత కాలంలో ఏ రెండు దేశాల మధ్య యుద్దం జరిగినా ఏదో ఒక దేశం ఆర్థికంగా నష్టపోక తప్పడంలేదు. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మన్నటి వరకూ కెనడా – భారత్ మాటల యుద్దంతో దౌత్యం తెగిపోయింది. దీంతో పప్పు ధాన్యాల దిగుమతి నిలిచిపోయి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. ఇక తాజాగా జరుగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్దం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సరఫరా నిలిపివేయడమే ప్రదాన కారణం..

గత నాలుగు రోజుల క్రితం హమాస్ – ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున రాకెట్ల దాడి చేసింది. దీనిని ఖండిస్తూ ఇజ్రాయెల్ – పాలస్తీనా పై యుద్దం ప్రకటించింది. దీంతో ఇరు దేశాలు పరస్పరం తీవ్ర దాడులు జరుపుకుంటున్నారు. ఇందులో సుమారు 1000 మందికి పైగా అమాయక ప్రజలు బలైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని ప్రభావం చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం హమాస్ దాడి ప్రారంభించిన రెండు రోజుల్లో అంటే సోమవారం నాటికి 4శాతం పెరుగుదల స్పష్టంగా కనిపించింది. ఇజ్రాయెల్ లో అధికంగా చమురు నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో యుద్దం జరుగుతోంది. దీని ప్రభావంతో చమురు ఉత్పత్తి సహా సరఫరా కూడా నిలిపివేశాయి ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థలు. దీంతో అవసరానికి తగ్గ చమురు మార్కెట్లో అందుబాటులో లేదు. ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆసియా మార్కెట్లో బ్రెంట్ 4.7 శాతం పెరిగి 86.65 డాలర్లకు చేరుకుంది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 4.5 శాతం పెరిగి 88.39 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇది ఇలాగే స్థిరంగా కొనసాగుతుంది అని చెప్పలేమంటున్నారు నిపుణులు.

అమెరికా – ఇరాన్ ఉద్రిక్తల ప్రభావం..

ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ద నేపథ్యంలో అమెరికా – ఇరాన్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతుగా ఉంది. అదే తరుణంలో ఈ యుద్దానికి అవసరమైన మరణాయుధాలు, బాంబులు, యుద్ద రాకెట్లు అన్నీ ఇరాన్, పాలస్తీనాకు అందిస్తోందని అమెరిగా తెలుసుకుంది. అందుకే ఇరాన్ పై దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ముడి చమురు అధికంగా లభించే సౌదీ, అరేబియా దేశాలు తమ ఉత్పత్తి నిలువలు తగ్గిపోవడంతో సరఫరా అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. దీంతో ధరలు పెంచేశాయి. దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై ఇప్పటికే పడింది. తాజాగా జరిగే ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం కారణంగా రానున్న రోజుల్లో మడి చమురు ధరలు మరింత పైకి ఎగబాకే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మన దేశంపై ఇలా..

సాధారణంగానే ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఒక్కసారి తక్కువ శాతంలో పెరిగినప్పటికీ దాని ప్రభావం డాలర్లపై చూపుతుంది. దీని కారణంగా మనకు రూపాయల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే గరిష్ట స్థాయిలో రూ. 5 నుంచి రూ. 10 వరకూ పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగే గతంలో రూ. 60 – రూ.70 ఉన్న పెట్రోల్ ప్రస్తుతం రూ.108 నుంచి రూ. 110 కి చేరింది. ప్రస్తుత ఇజ్రాయెల్ – హమాస్ ప్రభావంతో చమురు ఉత్పత్తి కొరత కారణంగా డాలర్లపై పడుతుంది. ఇప్పటి వరకూ కేవలం 4 శాతం పెరిగిన ముడి చమురు రేటు రానున్న రోజుల్లో మరింత పెరిగితే దీని ప్రభావం ఇండియన్ మార్కెట్ పై తప్పకుండా పడుతుంది అంటున్నారు వాణిజ్య నిపుణులు. ఇదే గనుక జరిగితే లీటర్ పెట్రోల్, డీజల్ ధరలు సాధారణంగా పెరగడం తోపాటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ కలుపుకొని మరింత భారంగా మారే అవకాశం ఉంటుంది.

T.V.SRIKAR