ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీ కార్యకర్తల్లో ఎనలేని జోష్ కనిపిస్తుంది. తమ నాయకుడు ఖర్చులకు డబ్బుల మొదలు తినేందుకు బిర్యానీ, తాగేందుకు మద్యం ఇలా అన్ని విలాసవంతమైన సౌకర్యాలను సమకూరుస్తారు. అదే క్రమంలో పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అక్కడకి భారీ సంఖ్యలో జనాలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దీనికి అయ్యే వాహనాల రవాణా ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఇక సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనే వారికి మంచి నీళ్ల ప్యాకెట్ మొదలు బిర్యానీ పొట్లం వరకూ అన్నీ తానే దగ్గరుండిచూసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును రూపాయితో సహా తనకు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అందులో భాగంగా ధరల పట్టికను కూడా విడుదల చేసింది.
ఈసీ కొత్త ఆదేశాలు..
సాధారణంగా రాజకీయ నాయకులు చేసే ఖర్చు ఒకటైతే రికార్డుల్లో చూపించే ఖర్చు వేరొకటి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే తెలంగాణలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచార ఖర్చులను తప్పని సరిగా లెక్కించేందుకు సిద్దమైంది ఎన్నికల కమిషన్. గతంలో సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు టీ, కాఫీ, టిఫిన్, బిర్యానీ, మద్యం ఇలా ప్రతి ఒక్క ఖర్చును వెచ్చించిన దానికంటే తక్కువగా చూపించారు నాయకులు. అందుకే ఈ సారి అలా జరుగకుండా ఉండేందుకు సరికొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ప్రతి ఒక్కదానికి ఎంత కేటాయించాలో స్పష్టం చేసింది. సభ నిర్వహించేందుకు వేసే టెంట్లు మొదలు కుర్చీల వరకూ.. వేదికల కోసం తీసుకొచ్చే టేబుళ్ల మొదలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కళాకారుల పారితోషకాల వరకూ అన్నింటికీ సరైన లెక్కలు చూపించాల్సిందే అని తేల్చింది.
గతంలో కంటే పెరుగుదల..
రాజకీయ నాయకులు తమ గెలుపే లక్ష్యంగా మితిమీరిన ఖర్చులను చేస్తూ ఉంటారు. అయితే వీటిని తన ఎన్నిలక ఖర్చుల్లో చూపించరు. దీనికి కారణం ఐటీ దాడులు జరుగుతాయన్న భయం ఒకటైతే.. ఈసీ ఇచ్చిన పరిమితికి మించి ఖర్చు చేస్తే వారి అభ్యర్థిత్వం పై వేటు వేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త పరిమితులను తీసుకొచ్చింది. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో పెరగిని ఓటర్ల సంఖ్య, ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్థిష్ట ఖర్చును నిర్ణయించింది. 2014లో ఎంపీ అభ్యర్థికి పరిమితి గరిష్టంగా రూ. 75 లక్షలు ఉండగా, దీనిని 2023 లో రూ. 90 లక్షలు చేసింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయాన్ని కూడా రూ. 28 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచింది.
ఈసీ తన జాబితాలో పేర్కొన్న ధరల వివరాలు..
T.V.SRIKAR