Election Commission Of India: నేడు 12 గంటలకు సీఈసీ ప్రెస్ మీట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

ఎట్టకేలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు సీఈసీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 09:00 AM IST

కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ మీడియా ముందుకు రానున్నారు. 2023లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం ల షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ అసెంబ్లీల గడువు జనవరి నెలలో ముగుస్తుండగా.. మిజోరంలో మాత్రం డిశంబర్ 17తో రద్దవుతుంది.

ఈ ఐదు రాష్టాల్లో నవంబర్ రెండవ వారం నుంచి డిశంబర్ మొదటి వారం వరకూ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు గతంలో ఈసీ బృందం వెల్లడించింది. అదే షెడ్యూల్ ని ప్రకటిస్తారా లేక ఏమైనా మార్పుల చేర్పులు చేసే అవకాశం ఉందా అనేది ఈరోజు తెలియనుంది. అయితే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలలో ఒకే విడతలో.. ఛత్తీస్గఢ్ లో మాత్రం రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

గత వారంలో తెలంగాణలో పర్యటించిన ఈసీ ప్రత్యేక బృందం ఇక్కడి పరిస్థితులను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. దీని తరువాత ఢిల్లీ వెళ్లిపోయారు ఎన్నికల ఉన్నతాధికారులు. వీరు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి సేకరించిన నివేదికను సీఈసీకి సమర్చించారు. ఇలా సమర్పించిన తరవాత వాటిని క్షుణ‌్ణంగా పరిశీలించిన ప్రధాన ఎన్నికల అధికారి నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులోని ముఖ్య అంశాలతో పాటూ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు.

T.V.SRIKAR