ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు ఈ సినిమా చుట్టే తిరుగుతోంది. రాంబాబును పేరడీ చేస్తూ శ్యాంబాబు అనే పాత్ర క్రియేట్ చేశారన్నది వైసీపీకి కోపం. దీని మీద మొదట్లో సైలెంట్‌గానే ఉన్న అంబటి.. ఎందుకో మరి ఒక్కసారిగా వయలెంట్ అయిపోయారు. ప్రెస్‌మీట్‌ల మీద ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ పవన్‌ను, బ్రో సినిమాను ఖండఖండాలుగా ఖండిస్తున్నారు. నా పాత్రతో నువ్ సినిమా చేస్తే.. నీ బతుకు గురించి నేను సినిమా చేస్తా అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. మ్రో, నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు – పెటాకులు, తాళి–ఎగతాళి, మూడు ముళ్లు – ఆరు పెళ్లిళ్లు, బహు భార్యా ప్రావీణ్యుడు, అయిన పెళ్ళిళ్లు ఎన్నో – పోయిన చెప్పులు ఎన్నో.. ఇలా సినిమా టైటిళ్లు కూడా చెప్పేశాడు. ఇక్కడితో ఆగారా అంటే.. బ్రో మూవీ ద్వారా బ్లాక్ మనీ వైట్‌గా మారిందని ఆరోపణలు గుప్పించారు.
ఈ సినిమా కోసం ఎన్ఆర్‌ఐలు అంతా కలిసి ఫండింగ్ చేశారని.. ఆ డబ్బులను నిర్మాతకు ఇచ్చారని.. వాటితోనే సినిమా చేశారు అన్నది అంబటి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ డబ్బుల వెనక చాలా మతలబులు ఉన్నాయని.. అంతుచూస్తామని ఈడీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి కూడా వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా.. జనసేన నేతలు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తిరుపతిలో అయితే జనసేన నేతలు.. ట్రిపుల్ ఆర్‌లాగా ట్రిపుల్ ఎస్ అని ఓ మూవీ కూడా స్టార్ట్ చేశారు. సందులో సంబరాల శ్యాంబాబు ఎట్ రాంబాబు అన్నది టైటిల్. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఒకరికి అంబటిలాగా వేషం వేయించి డ్యాన్సులు కూడా చేయించారు.
అంబటి సినిమా పేర్లకు పోటీగా.. జనసేన నేత పోతిన మహేష్ మరికొన్ని టైటిల్స్ రివీల్ చేశారు. అద్దెగదిలో అరగంట, తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093, డ్రైవర్ డోర్ డెలివరీ, కోడి కత్తి సమేత శ్రీను.. ఇలా అంబటితో పాటు జగన్‌ను కూడా బ్రో మూవీ రచ్చలోకి లాగేశారు. పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇలా ఇప్పుడు రాజకీయం బ్రో మూవీ చుట్టూనే తిరుగుతోంది. సమస్యలేవీ లేనట్లు.. ఇదే పెద్ద సమస్య అయినట్లు.. ఓవరాక్షన్‌లు, ఓవర్ మాటలు.. ఇదెక్కడి లొల్లి బ్రో.. అవసరమా ఇదంతా అంటున్నారు జనాలు. రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి. ఆయనను వెక్కిరిస్తూ ఈయన.. ఈయనను వెక్కిరిస్తూ ఆయన.. పోటీగా ప్రకటనలు, అర్థంలేని పోస్టర్లు పెడాతామంటే.. జనాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు జాగ్రత్త.. అసలే ఎన్నికల కాలం !