ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే !! ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్ పై, అఫైర్స్ పైనా నెటిజన్లకు చాలా ఆసక్తి ఉంటుంది. తాజాగా ఆయన పర్సనల్ లైఫ్ తో ముడిపడిన ఒక సంచలన విషయం బయటికి వచ్చింది. ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చిన ఒక మహిళ పై మీడియాలో కథనాలు రావడం మొదలైంది. ఇంతకీ ఆమె ఎవరనే చర్చ కూడా జరిగింది. ఆ మహిళ పేరు షివోన్ జిలిస్. పంజాబీ మూలాలున్న ఆమె ప్రొఫెషన్ పరంగా ఒక వెంచర్ క్యాపిటలిస్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోనూ దిట్ట. షివోన్ జిలిస్ తల్లి శారద పంజాబ్ కు చెందినవారు. తండ్రి రిచర్డ్ కెనడియన్. ఎలాన్ మస్క్ కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ లో ప్రస్తుతం డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈమెకు ఎలాన్ మస్క్ ద్వారా కవల పిల్లలు కలిగారనే విషయం తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
బయోగ్రఫీ సంచలనం..
వాల్టర్ ఐజాక్సన్ ఒక ప్రముఖ రచయిత. ఆయన గతంలో స్టీవ్ జాబ్స్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ జీవితాలపై రాసిన బయోగ్రఫీ బుక్స్ ఫేమస్ అయ్యాయి. తాజాగా ఎలాన్ మస్క్ పై రాసిన బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్ కానుంది. ఇది కూడా రికార్డు స్థాయిలో సేల్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బుక్ లో షివోన్ జిలిస్, ఎలాన్ మస్క్, వారి కవల పిల్లలతో కూడిన ఫోటోను ప్రింట్ చేయడం గమనార్హం. మస్క్ – జిలిస్ జంటకు ఐవీఎఫ్ ద్వారా 2021 నవంబర్ లో కవల పిల్లలు కలిగారని బయో గ్రఫీలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇలా ఒక మగ, ఒక ఆడ కవలలకు జన్మనివ్వగా.. కుమారుడికి స్ట్రైడర్ అని, కుమార్తెకు అజూర్ అని పేర్లు పెట్టారు. ఇంతేకాదు.. గ్రిమ్స్ అనే ఎలాన్ మస్క్ మాజీ భార్యకు కూడా తాజాగా మూడో సంతానం కలిగింది. అంతకుముందు మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్ ద్వారా మస్క్ కు ఐదుగురు మగ పిల్లలు కలిగారు. దీంతో తనతో కలిసిన మహిళల ద్వారా మస్క్ కు కలిగిన మొత్తం సంతానం సంఖ్య 10కి చేరింది. వీరిలో 8 మంది అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. మస్క్ ద్వారా గ్రిమ్స్ కు కలిగిన మూడో మగ సంతానానికి ‘టెక్నో మెకానికస్’ అనే పేరు పెట్టారు. ఈవివరాలతో తాజాగా ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ న్యూస్ స్టోరీని పబ్లిష్ చేసింది.
మొదటి పెళ్లి నుంచి లాస్ట్ అఫైర్ దాకా..
2000 సంవత్సరంలో కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను మస్క్ తొలి వివాహం చేసుకున్నాడు. 2008లో విల్సన్ నుంచి మస్క్ విడాకులు తీసుకున్నాడు. జస్టిన్‌తో విడిపోయిన తర్వాత, అమెరికన్ నటి తాలులా రిలేతో మస్క్ కు సంబంధం ఏర్పడింది. 2010లో వీరి వివాహం జరిగింది. కానీ ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో 2012లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత, వారిద్దరూ 2013లో మళ్లీ వివాహం చేసుకున్నారు. కానీ వారు కలిసి ఉండలేకపోయారు. రిలే, మస్క్ 2016లో మళ్లీ విడిపోయారు. రిలే నుంచి విడిపోయిన తరువాత, మస్క్ 2018లో కెనడా సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్ ప్రారంభించాడు. మరోవైపు ‘ఓపెన్ ఏఐ’ ప్రాజెక్టులో 2015 లో కలిసి పనిచేస్తుండగా షివోన్ జిలిస్ తో మస్క్ కు పరిచయం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది (2016 జూలైలో) మస్క్ స్థాపించిన న్యూరోటెక్ కంపెనీలో షివోన్ జిలిస్ కు టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ దక్కింది. 2017 మే నుంచి 2019 ఆగస్టు వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఆమె పనిచేశారు. తాజాగా మస్క్, జిలిస్ జంటకు కవలలు కలిగారనే విషయం బయటపడింది.